స్త్రీలు డ్రమ్ముల్లా మారుతున్నారు: డీఎంకే నేత

TN Assembly Polls 2021 DMK Leader Crude Comments On Women - Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దిండిగుల్ లియోని

తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న మహిళలు

సాక్షి, చెన్నై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. ప్రజాప్రతినిధులు సైతం ఇందుకు అతీతులు కారు. సభల్లో, పార్లమెంట్‌, అసెంబ్లీ వేదికగా స్త్రీల వస్త్రధారణ గురించి ఇష్టారీతిన మాట్లాడి వివాదానికి కారణమైన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా వీరి జాబితాలోకి డీఎంకే నాయకుడు ఒకరు చేరారు. విదేశీ ఆవు పాలు తాగుతూ మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళల శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నాయకులు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

ఆ వివరాలు.. డీఎంకే పార్టీ నాయకుడు దిండిగుల్ లియోని అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం లియోని, కార్తికేయ శివసేనాపతి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ.. మహిళల శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఇందులో.. ‘‘ప్రస్తుతం చాలా రకాలు ఆవులున్నాయి. ఫామ్‌లలో మీరు విదేశీ ఆవులను చూసే ఉంటారు. వీటి పాలను పితకడానికి మెషిన్లను వాడతారు.  ఒక్కసారి స్విచ్‌ వేస్తే.. మెషిన్‌ గంటలో 40 లీటర్ల పాలు పితుకుంది. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఈ విదేశీ ఆవుల పాలు తాగుతున్నారు. అందుకే వారి శరీరాకృతి మారి.. డ్రమ్ముల్లా తయారవుతున్నారు. గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారు. పిల్లల్ని అలవోకగా ఎత్తుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా కనిపించడం లేదు. లావుగా అయ్యి పిల్లలను ఎత్తుకోలేకపోతున్నారు. దానికి కారణం విదేశీ ఆవు పాలు తాగడమే’’ అంటూ ఇష్టారీతిన ప్రసంగిస్తూ పోయాడు.

లియోని పక్కనే ఉన్నవారు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసం రేషన్‌ సరఫరాపై మాట్లాడాల్సిందిగా లియోనికి సూచించారు. అతడు కాసేపు దాని మీద ప్రసంగించి మళ్లీ టాపిక్‌ను ఆడవారి వద్దకే తెచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాగా గతంలోనూ లియోని అనేక సార్లు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top