‘ఐటీ దాడులా...ఎంకే స్టాలిన్ ఇక్కడ’!

I Am MK StalinDMK Leader Message After Tax Raids On Son-In-Law - Sakshi

ఏఐడీఎంకే కాదు..డీఎంకే 

మిసా,ఎమర్జెన్సీ  చూశాం : స్టాలిన్‌

భయపడేదే లేదు  ఐటీ దాడులపై స్టాలిన్  స్పందన

సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికలకు  నాలుగు రోజుల ముందు ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ముఖ్యంగా డీఎంకే నేతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ  సోదాలపై  డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తన కుమార్తె, అల్లుడు ఇంటిపై శుక్రవారం నాటి  ఐటీ దాడులపై  ఘాటుగా స్పందించారు.  అలాగే తమిళనాడులోని కల్లకూరిచిలో డీఎంకె వ్యవస్థాపకుడు అన్నాదురై విగ్రహానికి నిప్పంటించిన ఘటననుకూడా స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు. (ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్‌)

పెరంబలూర్‌లో జరిగిన  ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..  ఎన్ని  ఐటీ దాడులు చేసిన తమ పార్టీకి భయపడేది లేదని తెగేసి చెప్పారు.  అంతేకాదు  తాము ఏఐఎడిఎంకె నాయకులు కాదని  ప్రధాని మోదీ తెలుసుకోవాలన్నారు.  ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  ఏఐఎడిఎంకె ప్రభుత్వాన్ని మోదీ సర్కార్‌  కాపాడుతోంది. కానీ తాను కలైంగర్‌ (దివంగత డీఎంకె  నేత ఎం కరుణానిధి) కొడుకుననే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  తాను మిసాను, ఎమర్జెన్సీని చూశాను..ఇలాంటి వాటికి భయపడను.. బీజేపీ తప్పుడు విధానాలకు ప్రజలు ఏప్రిల్ 6 న స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని  స్టాలిన్‌ స్పష్టం చేశారు. అలాగే డీఎంకే వ్యవస్తాపకుడు అన్నాదురై విగ్రహాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఐటీ దాడులపై డీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

కాగా డీఎంకేనేతలు, సంబంధిత వ్యక్తుల నివాసాలపై వరుస ఐటీ దాడులు తమిళనాట  కాక పుట్టించాయి. స్టాలిన్‌ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ  శుక్రవారం దాడులు చేపట్టింది. చెన్నై నగరానికి సమీపంలోని నీలాంగరాయ్‌లోని శబరీశన్ నివాసం, ఆయనకు చెందిన మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా  మరో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడి నిర్వహించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top