ఏడాదిన్నరలో బీజేపీ పీడ విరగడవుద్ది 

Telangana: Minister Malla Reddy Sensational Comments On BJP - Sakshi

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి   

వనపర్తి: ఎనిమిదిన్నర ఏళ్లుగా దేశ ప్రజలకు పట్టిన బీజేపీ శని మరో ఏడాదిన్నరలో విరగడవుద్దని, దివాలా తీసిన కాంగ్రెస్‌ పార్టీ సత్తువ కోల్పోయిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం శివారులో జ్యోతిబాపూలే బీసీ వ్యవసాయ మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి శివారులో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాల ప్రారంభోత్సవంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘రానున్న సాధారణ ఎన్నికల్లో బీఎస్‌ఆర్‌ కేంద్రంలో అధికారంలోకి రావాలని జోగుళాంబ అమ్మవారిని మొక్కి వచ్చాను. ధరలు పెంచి.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్న బీజేపీకి పాలించే అర్హత లేదు’అని అన్నారు. నిరంజన్‌రెడ్డి సీఎంకు చాలా దగ్గరుంటడు.. ఏది కావాలన్నా ఈయనకు ఇస్తడు.. అందుకే చిన్నదైన వనపర్తి జిల్లాను ఇంతగా అభివృద్ధి చేశారన్నారు.  

అంతకుముందు  నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు సమాన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదులసంఖ్యలో ఉన్న గురుకులాలను వంద సంఖ్యలోకి మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని సబిత చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఈ  ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని కమలాకర్‌ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా,  జ్యోతిబాపూలే గురుకులాల రాష్ట్రకార్యదర్శి మల్లయ్యభట్టు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top