కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను అవమానించారు 

Telangana: BJP Incharge Tarun Chugh Sensational Comments On CM KCR - Sakshi

జీ–20 అఖిలపక్ష భేటీకి గైర్హాజరు కావడమే అందుకు నిదర్శనం 

ఆయనకు ప్రధానిపై ఉన్న ద్వేషం కాస్తా దేశంపై ద్వేషంగా మారుతోంది 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ధ్వజం 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావుకు ప్రధానిపై ఉన్న ద్వేషం కాస్తా దేశంపై ద్వేషంగా మారుతోందని... అందుకే చరిత్రాత్మక జీ–20 కోసం ప్రధాని నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న జీ–20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి ప్రధాని నేతృత్వంలో జరిగిన రాజకీయ పార్టీల అధినేతల సమావేశానికి కేసీఆర్‌ గైర్హాజరై తెలంగాణ ప్రజలను అవమానించారని ఆయన మండిపడ్డారు.

సైద్ధాంతిక భావజాలాలకు అతీతంగా రాజకీయ పార్టీల అధినేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సూచనలు ఇచ్చారని తెలిపారు. కానీ ఈ సమావేశానికి కేసీఆర్‌ రాలేదని, ఆయన గురించి తెలిసిన వాళ్లకు ఇదేమీ పెద్దగా ఆశ్చర్యకరం కాదని ఛుగ్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కేసీఆర్‌కు రాజ్యాంగం పట్ల, దేశం పట్ల ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. గతంలో బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ రుజువులు చూపించమని అడిగిన కేసీఆర్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సైన్యం భారత్‌ను దంచికొడుతుందంటూ మన సైన్యాన్ని కించపర్చారని ఆరోపించారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉందని చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదని పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top