Telangana BJP: బండికి చిక్కులున్నాయా? సొంత టీమే షాకిస్తోందా?

Telangana BJP Bandi Sanjay Facing Problems From Own Party - Sakshi

ఈ సంవత్సరం ఆఖరులోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పార్టీ పెద్దలు టార్గెట్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పదే పదే పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి నిరంతరం రాష్ట్ర పార్టీని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ఎన్నిసార్లైనా తెలంగాణకు వస్తామని రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు చికాకులు మొదలయ్యాయని అంటున్నారు. పార్టీలో బాధ్యతలు తీసుకున్న వివిధ విభాగాల నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, పార్టీ అధికార ప్రతినిధులు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ఆఫీస్‌లో ప్రచారం జరుగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్న బండి సంజయ్‌ను.. సొంత టీం నిరాశకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. 

ఎక్కడికెళ్లారు మోర్చా నేతలు?
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాల్సిన కిసాన్ మోర్చా ఆందోళనలు చేసిన దాఖాలాలే లేవు. ధరణి వెబ్‌సైట్ సమస్యలపై గత నెల 27న కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చినా.. కిసాన్ మోర్చా నేతల జాడ కనిపించలేదు. ఇక మహిళా మోర్చా నేతలు.. పూజలతోనే సరిపెడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. యువ మోర్చా నేతలు గత మూడు మాసాలుగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్టీ మోర్చా పేరుకే పరిమితమయ్యాయి. పార్టీకి చెందిన ప్రతి అనుబంధ విభాగానికి రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ఉన్నా.. అవి చేసే పని మాత్రం సున్నా. అనుబంధ విభాగాల పరిస్థితి ఇలా ఉంటే.. పార్టీ అధికార ప్రతినిధుల వ్యవహారం మరోలా ఉంది. ఒక్కో అధికార ప్రతినిధిని ఒక్కో సబ్జెక్ట్ ఎంచుకుని మీడియాతో మాట్లాడాలని బండి సంజయ్ సూచించినా వారు పట్టించుకోవడం లేదు. 

ఢిల్లీలో ఎవరి గ్రాఫ్ ఎంత?
ఢిల్లీ పెద్దల దృష్టిలో బండి సంజయ్ గ్రాఫ్ పెరుగుతుండటం... ఆయనకు కేంద్ర నేతలు ప్రాధాన్యమివ్వడం రాష్ట్ర పార్టీలోని కొందరికి గిట్టడంలేదని..అందుకే రాష్ట్ర అధ్యక్షుడికి సహాయ నిరాకరణ మొదలైందనే ప్రచారం సాగుతోంది. అనుబంధ సంఘాల నేతలు స్పందించకపోవడం వెనక అదృశ్య శక్తులు పని చేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్న బండి సంజయ్.. సహాయ నిరాకరణ చేస్తున్న నేతలను ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top