TS: ఈ గుమ్మటాల గోలేంది.. అసలేం జరుగుతోంది? | Sakshi
Sakshi News home page

TS: ఈ గుమ్మటాల గోలేంది.. అసలేం జరుగుతోంది?

Published Sat, Feb 11 2023 9:15 PM

Telangana BJP Bandi Sanjay Domes Controversy Wont Benefit Party - Sakshi

తెలంగాణలో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడి డైలాగులు విసురుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన  వ్యాఖ్యలు కూడా వివాదస్పదమే. ఆయన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అలా చేస్తామని ఆయన అంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చాలని అంటే సంజయ్ ఏమో సచివాలయం గుమ్మటాలపై పడ్డారు.

కేవలం మూడు సీట్లు ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర పార్టీ నేతలు , రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరున లిక్కర్ స్కామ్ చార్జీషీట్‌లో చేర్చడం కలకలం రేపింది. అంతేకాదు. వీరికి సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేశారు.

ఈ పరిణామం ఏదో సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది. మరి కొంత ప్రముఖుల వద్దకు ఈ కేసు చేరే అవకాశం కనబడుతోంది. అలా జరిగితే తెలంగాణ రాజకీయం మరింత గరం, గరం అవుతుంది. ఇలా ఒకవైపు వ్యవహారం సాగుతుండగా, మరో వైపు బీజేపీ రాష్ట్ర నాయకులు వీధి మీటింగ్‌లు పేరుతో జనాన్ని ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు. ఆ క్రమంలో బండి సంజయ్ తీవ్రమైన డైలాగులు విసురుతున్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ గుమ్మటాలను కూల్చడం అంటే ఒకరకమైన సెంటిమెంట్ ను ప్రేరించడానికి ఆయన యోచిస్తున్నారన్నమాట.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ నిర్మాణాలను ప్రశంసించడమే కాకుండా తాజ్ మహల్‌తో పోల్చారు. ఈ నేపథ్యంలో సంజయ్కు తాజ్ మహల్లో సమాధి గుర్తుకు వచ్చింది. నిజానికి తాజ్ మహల్ ప్రపంచ వింతలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అమెరికాతో సహా ఆయా దేశాల అధినేతలు తాజ్‌నును సందర్శించి అనుభూతి పొందారు. అలాంటి ప్రసిద్ద కట్టడాన్ని సంజయ్ సమాధితో పోల్చడం సరికాదు. బహశా ఆయన మనసులో మరో అంశం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారేమో!

గతంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేశారు. ఆ మసీదుకు కూడా గుమ్మటం ఉండేది. మొత్తాన్ని గుణపాలతో తవ్వేశారు. అక్కడ రామాలయం ఉండేదన్నది వారి వాదన. రామాలయం కోసం బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాని రథయాత్ర చేసినప్పుడు పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బాబ్రీ మసీదు కూల్చినప్పుడు దేశం అంతా అట్టుడికింది. అయినా ఆ ఘట్టం బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడి , ఆ పార్టీ కేంద్రంలో అదికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది.

ఇప్పుడు అలా కాకపోయినా, తాము అధికారంలోకి వస్తే గుమ్మటాలను కూల్చుతామని సంజయ్ హెచ్చరిస్తున్నారు. ఆ గుమ్మటాలు భారతీయ, తెలంగాణ సంస్కృతిలో భాగం కాదని, నిజాం సంస్కృతిలోవని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే సంజయ్ విమర్శించిన వాటిలో ఒకటి మాత్రం హేతుబద్దంగానే ఉంటుంది. అంతకుముందు బాగున్న భవనాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేసి కొత్త నిర్మాణాన్ని చేసింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక అందమైన భవనాన్ని నిర్మించి అంబేద్కర్ పేరు పెట్టారు. ఈ భవనంపై గుమ్మటాల నిర్మాణాలు కనిపిస్తుంటాయి. బీఆర్ఎస్ ఆఫీస్  భవనం కూడా ఒకరకంగా ఇదే మోడల్లో పైన గుమ్మటాలతో కనిపిస్తుంటుంది. అది బీజేపీకి అంత నచ్చకపోవచ్చు. అంతమాత్రాన కొత్త సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామంటే జనంలో సెంటిమెంట్ పెరుగుతుందా అన్నది డౌటే.

బీజేపీ వారు కూడా కేంద్రంలో పార్లమెంటుకు కూడా కొత్త భవనాన్ని నిర్మించారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాకపోతే అది చాలాకాలం నాటిది కాబట్టి , మొత్తం కేంద్ర కార్యాలయాలన్నిటిని ఒకే చోటకు తీసుకు వచ్చే క్రమంలో  ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణం కోర్టుల వరకు వెళ్లి క్లియర్ అయ్యాయి. ఏది ఏమైనా అదేదో వేరే మత సంస్కృతిలో భాగంగా కనిపిస్తున్నాయి కాబట్టి కూల్చాలని ప్రచారం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది?

మంత్రి కేటీఆర్ రోడ్లపై ట్రాఫిక్కు అడ్డంగా ఉన్న మసీదులు, దేవాలయాలను తొలగించాలని అనడంపై కూడా సంజయ్ ఆక్షేపణ తెలిపారు. ముందుగా పాతబస్తీలోని మసీదులను తొలగించగలరా అని ప్రశ్నించారు.  ఈ ప్రశ్న సంగతి ఎలా ఉన్నా గుజరాత్లో దీనికి సంబంధించి అప్పటి మోదీ ప్రభుత్వం ఒక చట్టం కూడా తెచ్చి రోడ్లపై ప్రార్ధనా మందిరాలను తొలగించిందని చెబుతారు. ఈ సంగతి కూడా సంజయ్ గుర్తుంచుకోవాలి. తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా ఇలాంటి విషయాలలో ఏకాభిప్రాయం అవసరం అని చెప్పాలి. బీజేపీ ఇకనైనా గుమ్మటాల గోల వదలిపెట్టి విధానపరమైన అంశాలపైన స్పీచ్‌లు ఇస్తే మంచిది.
-హితైషి
చదవండి: పాదయాత్రల్లో బ్యాలెన్స్‌ తప్పుతున్న నేతలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement