
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దొడ్డిదారిన మడకశిర మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గిన టీడీపీ.. బలం లేకపోయినా ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టింది. గతంలో మొత్తం 20 వార్డులకు 15 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించగా, కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.
కాగా, రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని కూడా అప్రజాస్వామికంగా కైవసం చేసుకున్నారు.
మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్‌పర్సన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్‌గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు.