టీడీపీకి గద్దె బాబూరావు గుడ్‌బై...

TDP Leader Gadde Babu Rao resigns from party - Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన చేశారు. గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ... ‘పార్టీలో పరిస్థితులు బాగోలేదు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కరుమరుగైంది. అందుకే రాజీనామా చేస్తున్నా. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు పార్టీ వేరు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు.

నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. 1978లో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. కాంగ్రెస్‌లో ఉన్న నేను, ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ నుంచి ఆయన అడుగు జాడల్లో నడిచాను. చీపురుపల్లి ప్రజల సహకారంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పార్టీ కోసం అంకిత భావంతో పని చేశాను. అప్పట్లో ఎన్టీఆర్‌ శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బీ ఫారాలు నా చేతికే ఇచ్చేవారు. కానీ అప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడాలు వచ్చాయి. 

2004 నుంచి ఇప్పటివరకూ గద్దె బాబూరావు ఉన్నాడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసింది. నాకు ఎవరి మీద విమర్శలు చేయడం ఇష్టం లేదు. ఆత్మ గౌరవము, ఆత్మ సంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి ఇవాళ టీడీపీకి రాజీనామా చేస్తున్నా. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీలో నేడు గుర్తించే వారు లేకపోవడం నాకు చాలా బాధ కల్గించింది. ఎంతోమంది నచ్చజెప్పారు కానీ నా రాజీనామా నిర్ణయం మార్చుకోదల్చుకోలేదు.’ అని స్పష్టం చేశారు. కాగా గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పని చేశారు.

ఎన్టీఆర్‌తో గద్దె బాబూరావు (ఫైల్‌ ఫోటో)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top