Tamil Nadu: దిక్కుతోచని స్థితితో పన్నీరుసెల్వం

Tamil Nadu: Consecutive Defeats To Panneerselvam - Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పరిణామాలన్నీ ఎడపాడి పళనిస్వామికే అనుకూలంగా మారడంతో పన్నీర్‌సెల్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎడపాడి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చెల్లదు..అని ఆదేశించాలని కోరుతూ వేసిన అప్పీల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా మద్రాసు హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని ఆదేశించడం,అప్పటి వరకు అన్నాడీఎంకేలో యథాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేయడం ఓపీఎస్‌కు మింగుడుపడలేదు.

అన్నాడీఎంకే వ్యవహారంపై 3 వారాల్లోగా తీర్పు చెప్పాలని కూడా మద్రాసు హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన విచారణ ప్రారంభం కానుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించి చేపట్టాల్సిన తదుపరి చర్యలపై తన మద్దతుదారులు, చట్ట నిపుణులతో ఓపీఎస్‌ శనివారం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఇక అన్నాడీఎంకేలో కుమ్ములాటలు ఇలా ఉండగా, శశికళ, పన్నీర్‌సెల్వం ఏకమై రాజకీయంగా ముందుకు సాగాలని వంద దేవర్‌ సంఘాల ప్రతినిధులు వారిద్దరికీ శనివారం లేఖలు పంపడం చర్చనీయాంశంగా మారింది. 
చదవండి: రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే..

అఖిలపక్ష సమావేశానికి ఈపీఎస్‌.. 
ఓటరు కార్డుతో ఆధార్‌కార్డు అనుసంధానంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈనెల 1వతేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే తదితర గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే తరపున ఎడపాడి పళనిస్వామికి ఈసీ నుంచి పిలుపు వచ్చింది. చెన్నై రాయపేటలోని అన్నాడీంకే ప్రధాన కార్యాలయానికి ఆహ్వానపత్రం అందింది.

దీంతో అన్నాడీఎంకే కో కన్వీనర్‌ పదవి నుంచి ఎడపాడిని బహిష్కరించినట్లు, ఆయన స్థానంలో వైద్యలింగంను నియమించినట్లుగా ప్రధాన ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి పన్నీర్‌సెల్వం ఉత్తరం పంపారు. ఓపీఎస్‌ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ఎడపాడి సైతం శనివారం తన అనుచరగణంతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top