సిట్టింగ్‌గా మరోసారి పోటీకి సిద్ధమవుతున్న ‘సోయం’

Soyam Bapurao vs Payal Shankar - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీజేపీలో లుకలుకలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు వర్సెస్‌ ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి పాయల్‌ శంకర్‌ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. సిట్టింగ్‌గా మరోసారి సోయం  పోటీకి సిద్ధమవుతున్నారు. మరోపక్క ఇతర పార్టీల్లోని ఆశావహుల్ని పార్టీలోకి రప్పించేందుకు పాయల్‌ శంకర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోయంకు పోటీగా ఇతరులను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు శంకర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో ప్రచారం ఉంది. ఇటీవల వరుసగా వేర్వేరు చోట్ల జరుగుతున్న పార్లమెంట్‌ సన్నాహక సమావేశాలు పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం బీజేపీలో లుకలుకలను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

సోయంకు పోటీగా..
ఎంపీ సోయం బాపూరావుకు పోటీగా పార్టీలో ఇతర ఆశావహులను తెరపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యే శంకర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీల్లోనూ ఆశవాహులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌కు చెందిన జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్, మరో ఆదివాసీ ముఖ్యనేతను పార్టీలో చేర్పించేందుకు నేరుగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా చర్చ సాగుతోంది. టికెట్‌ హామీ కండీషన్‌తో పార్టీలో చేరే విషయంలో ఢిల్లీ పెద్దలు హామీ ఇవ్వకపోగా, హైదరాబాద్‌లోనే ఆ నేతలను చేర్పించాలని తిరిగి పంపించారని ప్రచారం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ ఇటీవల చేరారు. మరో ముఖ్య నేత మాత్రం టికెట్‌పై హామీ లేకపోవడంతో చేరకుండానే జిల్లాకు తిరిగి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ సమావేశాల్లో ఆ నేత యాక్టీవ్‌గా పాల్గొనడంతో పార్టీని వీడే యత్నాలు ముగిసినట్టేనా.. లేనిపక్షంలో మున్ముందు ఎలాంటి నిర్ణయం ఆ నేత తీసుకుంటారనే విషయంలో పార్టీలో సందిగ్ధం నెలకొంది.  

సిద్ధాంతాలు ఎటుపోయాయి..
సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకునే బీజేపీలో అవి మచ్చుకు కనబడటం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం. ప్రధానంగా ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడి మార్పు చోటుచేసుకోగా, అనూహ్యంగా పార్టీలో సీనియర్లను కాదని గుడిహత్నూర్‌ జెడ్పీటీసీ పతంగే బ్రహ్మానందంను ఎంపిక చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నాయకులు సుహాసినిరెడ్డి, ఆదినాథ్‌ వంటి వారికి అవకాశం ఇవ్వకుండా జెడ్పీటీసీకి ఆ పదవి కట్టబెట్టడం వెనుక పార్టీలో ముఖ్య నేతల మధ్య తీవ్ర విభేదాలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ భైంసా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జాదవ్‌ రాజేశ్‌బాబు ప్రచార రథం నియోజకవర్గాల్లో తిరుగుతుండడంపై పార్టీ కార్యకర్తలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు ఎటుపోతున్నాయన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీకి నష్టం జరిగించే విధంగా పార్టీలో కార్యక్రమాలు జరుగుతుండడంతో పలువురు సీనియర్‌ నేతలు సైతం నిరుత్సాహంగా ఉన్నట్లు సమాచారం.
 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top