శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!

Sasikala to Overcome Disqualification and Contesting in Elections - Sakshi

అనర్హతను అధిగమించేందుకు శశికళ సన్నాహాలు

ఆర్థిక నేరాల చట్టం కింద ఎన్నికల్లో పోటీకి ఆరేళ్ల నిషేధం 

సిక్కిం రాజకీయాల ఉదాహరణగా కోర్టులో పిటిషన్‌ 

సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు.

ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్‌సింగ్‌ దమాంగ్‌ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.

ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్‌ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్‌ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్‌ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు.  

దవండి:
ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది

ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top