ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత

Premalatha Says DMDK Will Contest Alone In All Seats In Assembly Elections - Sakshi

సాక్షి, చెన్నై: అసెంబీ ఎన్నికల్లో ఒంటరి పోరుకైనా సిద్ధంగానే ఉన్నామని శనివారం డీఎండీకే ప్రకటించింది. ఆదివారం పొత్తుపై ఆ పార్టీ అధినేత విజయకాంత్‌ ప్రకటన చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమితో ఎన్నికల్ని డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో  డిపాజిట్లే కాదు, ఉన్న కాస్త ఓటు బ్యాంక్‌ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి. అయినా తాము అదే కూటమిలో ప్రస్తుతానికి ఉన్నామని ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత చెబుతున్నారు. 2021 ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది అందరితో చర్చించి ప్రకటిస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓ వైపు స్పందిస్తూ, మరో వైపు చిన్నమ్మ శశికళకు మద్దతుగా గళాన్ని ప్రేమలత వినిపించడం చర్చకు దారి తీసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే ఎటో అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే సైతం డీఎండీకేను పెద్దగా పట్టించుకోనట్టుగా ప్రచారం సాగుతోంది. డీఎండీకే 41 సీట్లు ఆశిస్తుండగా, పది సీట్లు ఇవ్వడానికి అన్నాడీఎంకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో శనివారం డీఎండీకే ఇన్‌చార్జ్‌ల సమావేశం జరగడంతో ప్రాధాన్యత నెలకొంది.  

ఇన్‌చార్జ్‌లతో భేటీ.. విజయకాంత్‌ దూరం.. 
రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను డీఎండీకే రంగంలోకి దించిన విషయం తెలిసిందే. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ ఇన్‌చార్జ్‌లను నియమించి ఎన్నికల పనుల వేగాన్ని పెంచారు. మొత్తం 320 మంది ఇన్‌చార్జ్‌లతో డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ శనివారం కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశానికి అధినేత విజయకాంత్‌ రాలేదు. ఇందులో అసెంబ్లీ ఎన్నికల పనులు, పట్టున్న నియోజకవర్గాలు, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే పరిస్థితి గురించి సమీక్షించారు. సమావేశం చివర్లో పొత్తు నిర్ణయానికి అధికారాన్ని విజయకాంత్‌కు అప్పగించారు. ఒంటరి పోటీకైనా డీఎండీకే సిద్ధం అని ప్రకటించారు. పొత్తా, ఒంటరి పయనమా అనే విషయంగా ఆదివారం విజ యకాంత్‌ ప్రకటన చేస్తారని డీఎండీకే వర్గాలు పేర్కొనడంతో ఎదురుచూపులు పెరిగాయి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top