తెలంగాణ తీరును ప్రజల్లోకి తీసుకెళ్దాం

Sajjala Ramakrishna Reddy Comments On Telangana Government - Sakshi

నదీ జలాల ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది

తన పార్టీ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ జలదోపిడీ

సందట్లో సడేమియాలా చంద్రబాబు దొంగ నాటకాలు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు

వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో వర్చువల్‌ సమావేశం

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడమే పరమావధిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వ వాదన, ఆ నీటిపై ఆంధ్రప్రదేశ్‌ హక్కు, వాడుకుంటున్న నీటిపై వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 109 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. వాస్తవ విరుద్ధమైన వారి వాదననను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనకు రావాల్సిన నీటి వాటా కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని, దానిపై తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్‌ తన పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే జల దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో పచ్చమీడియా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నదీ జలాల ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే.. మరోవైపు సందట్లో సడేమియాలా చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతూ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదానికి మూల కారకుడు, అసలు నేరస్తుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఆయన.. అప్పట్లో తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడదాం 
తెలంగాణ అబద్ధపు ప్రచారానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని అందరికి చాటి చెప్పేలా కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అందరూ బాగుండాలన్నదే సీఎం అభిమతం అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. తెలంగాణ అడ్డగోలు వాదనకు గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా, సంయమనం పాటిస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కేంద్రం పరిష్కారం చూపడం లేదని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మనం రెచ్చిపోకుండా రైతులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దిగువన ఉన్న వారు ఎలా దోపిడీ చేస్తారని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు.  వాస్తవ విషయాన్ని ప్రజలందరికి వివరించి, అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు.

మా కోటా నీటినే వాడుకుంటాం
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో పలు ఒప్పందాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోంది. మేము చేపట్టింది ప్రాజెక్టు కాదు. కేవలం ఎత్తిపోతల పథకం మాత్రమే. అందువల్ల దాన్ని ఆపాలని చెప్పడం సరికాదు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు పైగా నీరుంటేనే.. పోతిరెడ్డిపాడు ద్వారా మనకు రావాల్సిన 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం సా«ధ్యమవుతుంది. మాకు కేటాయించిన నీటి కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకోం. ఇదే విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నీరు ఉన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి దాకా 30, 40 టీఎంసీలు డ్రా చేశారు. అటు పులిచింతల నుంచి కూడా 14 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించాలి.     
–అనిల్‌ కుమార్‌ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top