అరాచక పాలనకు ఆద్యుడివి | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

అరాచక పాలనకు ఆద్యుడివి

May 19 2021 4:01 AM | Updated on May 19 2021 10:37 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

అరాచక, ఆటవిక పాలన సాగించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలోనే పౌర హక్కులకు భంగం కలిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

సాక్షి, అమరావతి: అరాచక, ఆటవిక పాలన సాగించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలోనే పౌర హక్కులకు భంగం కలిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నాడు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని కొడితే పంచాయతీ చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఎర్ర చందనం దుంగల కేసు గురించి ఆలోచిస్తే చంద్రబాబు బండారం బట్టబయలవుతుందన్నారు.

కూలీలను కాల్చి చంపిన కేసును మసిపూసి మారేడు కాయ చేసింది చంద్రబాబు కాదా? అది నియంతృత్వం కాదా? అని ప్రశ్నించారు. పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని, అరాచకం అంటే అది కాదా? అని నిలదీశారు. నిరంకుశత్వం, రాక్షసత్వం అన్నీ చంద్రబాబులోనే నింపుకుని నీతిసూత్రాలు వల్లిస్తూ ఇతరులపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ ప్రమేయం ఎక్కడుంది?
హైకోర్టు ఆదేశాల మేరకే ఏర్పాటైన మెడికల్‌ బోర్డు ద్వారా రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు జరిగాయి. నివేదికను బోర్డు నేరుగా న్యాయస్థానానికే అందచేసింది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఎక్కడుంది? అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? ఆయనకు బెయిల్‌ రాకపోవడంతో చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం తనను కొట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారు. రఘురామరాజు ఒకపక్క మీసం మెలేస్తున్నారు. మరోపక్క అరికాళ్లపై నడుస్తున్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఓ వర్గం మీడియా ఆపసోపాలు పడుతోంది. మా పార్టీ నాయకుడు పోరాటాల నుంచి వచ్చారు. ఆయనకు ప్రజా సంక్షేమం మినహా మరే ఆలోచన లేదు. కుట్రలకు పాల్పడితే వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళతాయి. 

ఎదుర్కోలేక అడ్డదారులు...
ప్రజల విశ్వాసంతో వరుసగా ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేక టీడీపీ అడ్డదారులను ఆశ్రయిస్తోంది. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రఘురామకృష్ణరాజును పావుగా వాడుకుంటున్నారు. కోట్లమంది అభిమానులు, లక్షలాది మంది కార్యకర్తలున్నా సీఎం జగన్‌ సంయమనంతో ఉన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించినా నిగ్రహం పాటించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇలాంటివి ఎన్నో చూశారు. ఆయన ఏదైనా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటారు. కోవిడ్‌ ఉధృతి వల్లే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఎక్కువ రోజులు జరపలేకపోతున్నాం. టీడీపీ నేతలు అసెంబ్లీని బహిష్కరించడం అంటే చట్టసభలను అగౌరవపరచడమే.

మరి ఇవేంటి బాబూ?
రాజద్రోహం అంటే ఎప్పుడూ వినలేదని జూమ్‌లో చెబుతున్న చంద్రబాబు ఆయన హయాంలో ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 12 చోట్ల రాజద్రోహం కేసులు బనాయించారు. న్యాయవాదులపై కేసులు పెట్టించారు. సాక్షి విలేకరులపై 12 కేసులు పెట్టించారు. గిడ్డి ఈశ్వరిపై మూడు కేసులు నమోదు చేయించారు. చినరాజప్ప దిష్టిబొమ్మ దహనం చేశారని బీజేపీ నేతలపై కేసులు పెట్టించారు. గుంటూరులో ముస్లిం యువకులపై కేసులు నమోదు చేయించారు. కుట్రలు, కుతంత్రాలతో కూడిన పాలన అంటే చంద్రబాబుదే. 

లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం..
సీఎం జగన్‌ ఎప్పుడూ అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశంగానే భావిస్తారు. ప్రభుత్వం, సీఎంపై టీడీపీ నేతలు బురద చల్లడం దుర్మార్గం. రఘురామకృష్ణరాజును అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు పాల్పడ్డారు. కక్షపూరితంగా కేసులు పెట్టారన్న టీడీపీ ఆరోపణలే నిజమైతే రెండేళ్లలో ఎంతో మందిపై కేసులు నమోదయ్యేవి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రపై ఆధారాలతోనే కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. ఆయన్ను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు లేఖ రాశాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement