Sakshi News home page

రేవంత్‌రెడ్డి అనే నేను.. 

Published Fri, Dec 8 2023 12:53 AM

Revanth Reddy Takes Oath As Telangana CM - Sakshi

ఉదయం నుంచి కాంగ్రెస్‌ అగ్రనేతల రాక, ఆహ్వానాలు.. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారాలు, సభ.. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం.. అధిష్టానం నేతలకు వీడ్కోలు.. సాయంత్రం సచివాలయం వద్ద హడావుడి.. సీఎం చాంబర్‌లో రేవంత్‌ బాధ్యతల స్వీకరణ.. తర్వాత కాసేపటికే కొత్త కేబినెట్‌ తొలి సమావేశం.. రాత్రిదాకా వాడీవేడిగా చర్చలు.. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిరోజు హడావుడిగా కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్‌రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

వారంతా తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లగా.. రేవంత్‌ తన నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కుటుంబంతో కలసి జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ తాజ్‌ కృష్ణ హోటల్‌కు చేరుకుని, కాంగ్రెస్‌ అగ్రనేతలతో కలసి ఎల్బీ స్టేడియానికి వచ్చారు. గవర్నర్‌ తమిళిసై సీఎంగా రేవంత్‌తో, ఇతర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక గవర్నర్, ఏఐసీసీ నేతలు వెళ్లిపోగా.. రేవంత్‌ ప్రజలను ఉద్దేశించి సీఎంగా తొలి ప్రసంగం చేశారు. తర్వాత మళ్లీ తాజ్‌ కృష్ణ హోటల్‌కు వెళ్లారు.

ఏఐసీసీ పెద్దలతో కలసి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. గౌరవ వందనం స్వీకరించి, సచివాలయమంతా కలియతిరిగారు. సీఎం చాంబర్‌లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత తొలి కేబినెట్‌ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై మంత్రివర్గం చర్చించింది. ఇక శనివారం అసెంబ్లీ సమావేశం నిర్వహించి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గురువారం మధ్యా హ్నం 1:19 గంటలకు ఆయనతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్ర మార్క, కేబినెట్‌ మంత్రులుగా ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి అన సూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు.

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక, హిమాచల్‌ సీఎంలు సిద్ధరామయ్య, సుఖి్వందర్‌సింగ్‌ సుక్కు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

పవిత్ర హృదయంతో అంటూ ఇద్దరు.. ఒకరు ఇంగ్లిష్‌లో.. 
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 9 మంది మంత్రులు దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాత్రం పవిత్ర హృదయంతో అంటూ ప్రతిజ్ఞ చేశారు. దామోదర రాజనర్సింహ ఇంగ్లి‹Ùలో, మిగతా అందరూ తెలుగులో ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైంది.

ట్రాఫిక్‌ సమస్య కారణంగా గవర్నర్‌ 1:17 గంటలకు సభా వేదిక వద్దకు వచ్చారు. రేవంత్‌ వేదిక దిగి వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారాలు మొదలయ్యా యి. 28 నిమిషాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం 1:46 గంటలకు ముగిసింది. తర్వాత గవర్నర్‌ తమిళిసై, కాంగ్రెస్‌ అగ్రనేతలు వెళ్లిపోయారు. 

ఓపెన్‌ టాప్‌ జీపులో.. కలియదిరిగి.. 
సోనియాగాంధీతో కలసి రేవంత్‌రెడ్డి ఓపెన్‌టాప్‌ జీప్‌లో ఎల్బీ స్టేడియంలోకి వచ్చారు. సోనియా గాంధీ ముందు నిలబడగా.. ఆమెకు కాస్త వెనుకగా రేవంత్‌ నిలబడి స్టేడియంలో కలియదిరిగారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. తర్వాత రేవంత్‌ స్వయంగా సోనియాను తోడ్కొని వేదికపైకి వచ్చారు. రాహుల్, ప్రియాంక నడుచుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. కార్యక్రమం ముగిశాక సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్‌ స్వయంగా వీడ్కోలు పలికారు. తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చి ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగం చేశారు. 

సీతక్క.. హోరెత్తిన స్టేడియం 
మంత్రులందరిలో సీతక్క ప్రమాణ స్వీకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రిగా సీతక్క పేరు ప్రకటించగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో హోరెత్తింది. ఆ హోరులో సీతక్క ఒక నిమిషం పాటు ఆగిపోవాల్సి వచ్చింది. ఇది చూసి వేదికపై ఉన్న పెద్దలు, నేతలంతా ఆశ్చర్యపోయారు. ప్రమాణం కొనసాగించాలంటూ గవర్నర్‌ తమిళిసై సైగ చేయడంతో సీతక్క ఆ హోరులోనే ప్రమాణ స్వీకారం కొనసాగించారు. తర్వాత సోనియా వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. సోనియా లేచి నిలబడి సీతక్కను హత్తుకుని అభినందించారు.  

అగ్రనేతలతో.. ఒకే వాహనంలో.. 
గురువారం ఉదయం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ గుడికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌గా ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలసి రేవంత్‌ ఒకే వాహనంలో కూర్చున్నారు. సోనియా సభావేదికపై వచ్చాక రేవంత్‌రెడ్డి మనువరాలిని చూసి ముద్దాడారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక.. రేవంత్‌రెడ్డి వేదికపైనే ఉన్న తన సతీమణితో కలసి సోనియా దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. తన కుమార్తెను, అల్లుడిని సోనియా, రాహుల్, ప్రియాంకలకు పరిచయం చేశారు. 

ప్రమాణ స్వీకారం.. పదనిసలు 
► గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. 

► ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదట, చివరిలో నల్లగొండ గద్దర్‌ స్వయంగా రాసి, పాడిన ‘మూడు రంగుల జెండా పట్టి’ పాట పార్టీ శ్రేణులకు హుషారెక్కించింది. 

► సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండే సోనియాగాంధీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ం కొలువుదీరే సందర్భంగా హాజరవడం గమనార్హం. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెతోపాటు, రాహుల్, ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

► మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని రేవంత్‌రెడ్డి దగ్గరికి తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మంత్రులు వేదికపై ఉన్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఇతర అగ్రనేతలకు మర్యాదపూర్వకంగా నమస్కరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రతి మంత్రిని భుజం తట్టి ఆశీర్వదించారు. 

► ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. 

► రేవంత్‌ ప్రసంగిస్తూ.. ‘ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, అక్కడ ప్రగతిభవన్‌ చుట్టూ ఉన్న కంచెలు బద్దలుగొట్టాం. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావొచ్చు’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. 

► ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి వస్తున్న పలువురు ప్రముఖుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కాగా,ఏపీకి చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీ జెండాలు పట్టుకొని స్టేడియంలో హల్‌చల్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిపడుతూ.. టీడీపీ కార్యకర్తలను చితకబాదడంతో అక్కడి నుంచి పారిపోయారు. కాంగ్రెస్‌ సభలో టీడీపీ జెండాలు ఏమిటని, మళ్లీ టీడీపీ జెండాలు కనిపిస్తే పీకి పారేయాలని సీనియర్‌ లీడర్లు కార్యకర్తలకు సూచించారు.   

Advertisement
Advertisement