‘మరో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం’ | Revanth Reddy Key Comments On Rythu Bharosa | Sakshi
Sakshi News home page

‘మరో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం’

Jun 16 2025 8:16 PM | Updated on Jun 16 2025 8:21 PM

Revanth Reddy Key Comments On Rythu Bharosa

సాక్షి,హైదరాబాద్‌: మరో పదేళ్లు తెలంగాణ కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని సీఎం  రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఇవాళ రైతునేస్తం వేదిక నుంచి బటన్‌ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమచేశారు.9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం. గతంలో పదవులు అనుభవించిన వాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు.

పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు.

వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం.

మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్న బియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారు

ఒక్కొక్కటిగా సరి దిద్దుకుంటూ..ముందుకు వెళుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం.రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. 18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పించాం. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది.

కొంత కాలమైనా సమయం ఇవ్వరా..? సరిదిద్దుకొనివ్వరా?. భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం.

రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా. రైతులు పంట మార్పిడి చేయండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement