పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా? | Revanth Reddy comments on BJP and Narendra Modi | Sakshi
Sakshi News home page

పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా?

Mar 27 2024 4:44 AM | Updated on Mar 27 2024 12:26 PM

Revanth Reddy comments on BJP and Narendra Modi - Sakshi

ఏం చేశారని మోదీకి మూడోసారి ఓటేయాలి? 

బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్న 

పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు 

గుజరాత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ తీసుకెళ్లి, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌ ఎందుకు తేలేదు? 

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది 

రంగారెడ్డి నుంచే పార్టీ పార్లమెంటు ఎన్నికల శంఖారావం 

ఏప్రిల్‌ 6 లేదా 7న తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి గ్యారంటీల ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వా లా? అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ అభ్యర్థులకు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేయాలని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చిందని, ఇక్కడి నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్‌ అభ్య ర్థులను లోక్‌సభకు పంపిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగు తుందని చెప్పారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.

పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 

ఏం చూసి మోదీకి ఓటేయమంటారు?
‘గత పదేళ్లలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బుల్లెట్‌ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌ ఎందుకు తేలేదు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి నిధులెందుకు ఇవ్వలేదు? రీజినల్‌ రింగు రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు..’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

అన్నీ బేరీజు వేసిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక
‘రాష్ట్రంలో ఈసారి 14 లోక్‌సభ స్థానాల్లో గెలవా లన్న పట్టుదలతో పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేలు అన్నీ బేరీజు వేసిన తర్వాతనే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానితో మరొకదానికి సంబంధాలున్నాయి. ఇలాంటివన్నీ ఆలోచించిన తర్వాతే ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశాం. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ వందరోజుల పాలనకు రెఫరెండం లాంటివి. తెలంగాణలో 14 స్థానాలు గెలిచి సోనియాకు కృతజ్ఞతలు చెబుదాం..’ అని సీఎం అన్నారు. 

6 లేదా 7న రాష్ట్రానికి ఖర్గే, రాహుల్‌
‘కార్యకర్తలకు అండగా నిలబడడంతోపాటు దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్‌గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు. రాహుల్, సోనియాగాంధీల నాయకత్వాన్ని బలపరిచే బాధ్యత అందరిపై ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలో ఆరు గ్యారంటీలు ప్రకటించుకున్నాం. మళ్లీ అదే తుక్కుగూడలో ఏప్రిల్‌ 6 లేదా 7వ తేదీల్లో జాతీయ స్థాయి గ్యారంటీలను ప్రకటించుకోబోతున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నాం. ఈ జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలతోపాటు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరవుతారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 

డోర్లు తెరిచి దొంగల్ని కూడా తీసుకొస్తే కష్టం కేఎల్లార్‌ వ్యాఖ్యలు వైరల్‌
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మా ధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ‘డోర్‌ తెరుస్తాం... డోర్‌ తెరుస్తాం అని అంటున్నారు. మీరు డోర్లు తెరిచి కాంగ్రెస్‌ పార్టీని మోసం చేసిన దొంగలను కూడా లోపలికి తీసుకొస్తే మా లాంటోళ్లు, కార్యకర్తలు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కేఎల్లార్‌కు, రేవంత్‌రెడ్డికి పడదేమో అని అక్కడక్కడా కార్యకర్తలు అనుకుంటున్నారు. మనమిద్దరం దగ్గరి మిత్రులం అనే విషయం వాళ్లకు తెలియదు. నేను చెప్పినా నమ్మేటట్టు లేరు. కాబట్టి మీరు చెప్పాలి..’ అని కేఎల్లార్‌ వ్యాఖ్యానించారు. నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement