వేలంలో రూ.వెయ్యి కోట్ల అవినీతి

Revanth Reddy allegations on Kokapeta lands - Sakshi

కోకాపేట భూములపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణ 

భూములు దక్కించుకున్న వారంతా

సీఎం కేసీఆర్‌ సన్నిహితులు, టీఆర్‌ఎస్‌ నేతలే.. 

ఈ వ్యవహారంపై అమిత్‌షా, మోదీలకు ఫిర్యాదు చేస్తా 

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు తెలంగాణలో కొనసాగే అర్హత లేదు 

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేట భూముల వేలంపై రాష్ట్ర ప్రభుత్వానికి కాక తగిలేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌ కుటుంబ సన్నిహితులే ఈ భూములను దక్కించుకున్నారని, ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో కేవలం వారే పాల్గొనడం వెనుక ఆంతర్యమేమిటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. శనివారం ఇక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ ఎస్‌.రాజయ్య, టీపీసీసీ నేతలు విజయరమణారావు, నర్సారెడ్డి, హర్కర వేణుగోపాల్, సామ రామ్మోహన్‌రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూములను అమ్మడాన్ని తాము ముందునుంచీ వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఖరీదైన భూములకు నిర్వహిస్తున్న వేలంలో దేశ, విదేశాల నుంచి అంతర్జాతీయ ఐటీ, ఫార్మా, ఇతర కంపెనీలు భాగస్వాములవుతాయని అనుకున్నామని, కానీ కేసీఆర్‌ మనుషులకు చెందిన కంపెనీలే పాల్గొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

పదిహేనేళ్ల క్రితమే ఎకరం రూ.14 కోట్లు 
పదిహేనేళ్ల క్రితం కోకాపేట భూములను వేలం వేసినప్పుడే ఎకరా రూ.14 కోట్ల ధర పలికిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో ఓఆర్‌ఆర్‌ లేదని, ఎయిర్‌పోర్టు ఇంకా ప్రారంభం కాలేదని, ఐటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లు లేవని, రోడ్లు, నీళ్లు, విద్యుత్‌ సౌకర్యాలు సరిగా లేవని, అయినా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలకు చెందిన కంపెనీలు వేలంలో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు విశ్వనగరిగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందిన తర్వాత బయటివారు ఎందుకు వేలంలో పాల్గొనలేదో అర్థం కావడం లేదన్నారు. తాజాగా ప్రభుత్వం వేలం వేసిన భూములు గండిపేట జలాశయానికి కూతవేటు దూరంలో ఉన్నాయని, ఎన్జీటీ ఉత్తర్వులు, 111 జీవో కారణంగా ఈ భూముల్లో కేవలం ఒక్క ఫ్లోర్‌ నిర్మాణానికే అనుమతి వస్తుందని, ఫలితంగా నష్టపోతారని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పలు కంపెనీల ప్రతినిధులకు ఫోన్లు చేసి బెదిరించి వేలంలో పాల్గొనకుండా చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.  

సీఎస్‌ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలి 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన చోటల్లా సంతకం పెడుతున్నందు వల్లే సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆ పదవిలో కొనసాగుతున్నారని, అసలు ఆయనకు ఆ స్థానంలో పనిచేసే అర్హత లేదని రేవంత్‌ అన్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆయన్ను అక్కడకు వెళ్లాలని క్యాట్‌ ఆదేశిస్తే దాన్ని హైకోర్టులో సవాల్‌ చేసి స్టే తెచ్చుకున్నారని, ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నా, దానికి సంబంధించిన ఫైలు కనిపించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని హైకోర్టులో సోమేశ్‌కుమార్‌ కేసు విచారణ జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న భూకుంభకోణాల్లో సీఎస్‌ సోమేశ్‌కు కూడా పాత్ర ఉందని రేవంత్‌ ఆరోపించారు.  

భూములు దక్కించుకున్నవారు వీరే... 
మైహోం సంస్థకు చెందిన ఆక్వాస్పేస్, వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజపుష్ప, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి తమ్ముడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఎంఎస్‌ఎన్‌ ఫార్మా, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న ప్రిస్టేజ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, వర్సిటీ ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (శ్రీచైతన్య కళాశాలలకు చెందిన వారిది)లు వేలంలో భూములు దక్కించుకు న్నాయని రేవంత్‌ రెడ్డి చెప్పారు. కోకాపేట భూముల వేలం విచిత్రంగా ఉందని, ఎకరం రూ.60 కోట్ల ధర పలికిన భూమి పక్కనే ఉన్న భూమి ఎకరా రూ.30 కోట్లు ఎలా పలుకుతుందని ప్రశ్నించారు. అందరూ కూడబలుక్కుని రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రూ.1,000 కోట్లను కొల్లగొట్టారని ఆరోపించారు.

ఈ వ్యవహారాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతానని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, బీజేపీ నేతలు కేసీఆర్‌పై ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాన న్నారు. ఆ రెండు పార్టీల బాగోతాన్ని తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తానని పేర్కొన్నారు. ఈ టెండర్లతో నిజంగా కేసీఆర్‌ కుటుంబానికి సంబంధంగానీ, ఈ దోపిడీలో వాటా, పాత్రగానీ లేకపోతే వెంటనే ఈ వేలం ప్రక్రియను రద్దు చేసి స్విస్‌ చాలెంజ్‌ విధానంలో టెండర్లు పిలవాలని, ఎకరాకు కనీసం రూ.60 కోట్లు అప్‌సెట్‌ ధర నిర్ధారించాలని కోరారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top