రాజస్తాన్‌లో కొత్త పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు గుబులు | Rajasthan Elections: RLP-Azad Samaj Party Alliance Tension For Congress & BJP | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో కొత్త పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు గుబులు

Oct 30 2023 11:55 AM | Updated on Oct 30 2023 12:31 PM

Rajsthan Elections: RLP Azad Samaj Party Alliance Tension For Congress BJP - Sakshi

రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన కీలక పరిణామం అధికార కాంగ్రెస్‌ను, అంతకంటే ఎక్కువగా విపక్ష బీజేపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న జాట్లు, దళితుల పేరిట రెండు పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల ఈ రెండు సామాజికవర్గాలను అవి ఆకట్టుకుంటే ప్రధాన పార్టీలకు తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది... 

రాజస్తాన్‌ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు ప్రముఖ జాట్‌ నేత, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) నేత హనుమాన్‌ బెనీవాల్‌ ప్రకటించారు. అంతేగాక 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను కూడా శనివారమే ప్రటించారాయన. మిగతా అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ ఆదరణ ఉన్న దళిత నేత, భీం ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ కూడా ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరాం) పేరుతో రాష్ట్రంలో తొలిసారి బరిలో దిగుతున్నారు.

ఈ రెండు పార్టీలూ ఎన్నికల పొత్తు కుదుర్చుకుని రాజస్తాన్‌ బ్యాలెట్‌ పోరును మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. రాజస్తాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బలమైన ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం చాలా ఉందని ఈ సందర్భంగా బెనీవాల్, ఆజాద్‌ సంయుక్త విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇందుకోసం ‘కిసాన్, జవాన్, దళిత్‌’వర్గాలు కలిసి రావాలంటూ వారిచ్చిన పిలుపు వెనక లోతైన అర్థమే దాగుంది. ఈ నయా జాట్‌–దళిత బంధం కాంగ్రెస్, బీజేపీ అవకాశాలను బాగానే దెబ్బ తీసేలా కనిపిస్తోంది. 
చదవండి: లిక్కర్‌ స్కాంలో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాకు దక్కని ఊరట

బీజేపీకే ఎక్కువ నష్టం...! 
ఆరెల్పీకి జాట్లలో ఎంతో పట్టుండటమే గాక దళితుల్లోనూ ఆదరణ ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఇద్దరు దళితులే కావడం ఇందుకు నిదర్శనం. ఇక ప్రధానంగా దళిత పార్టీ అయిన ఏఎస్పీ రాజస్తాన్‌లో తొలిసారిగా బరిలో దిగుతోంది. అది కూడా దళితుల ఓట్లను గణనీయంగానే ఆకర్షించేలా కనిపిస్తోంది. వీటి జంట పోటీతో జాట్, దళిత ఓట్లు సంఘటితమైతే అది ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు చేటు చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఎక్కువ నష్టం జరిగేలా కనిపిస్తోంది.

ఎందుకంటే గత నాలుగేళ్లలో రాజస్తాన్‌లో పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమే ఎదురైంది. ఇందుకు ఆ పార్టీ ఓట్లను ఆరెల్పీ చీల్చడం కూడా గట్టి కారణమే. 2022ల సర్దార్‌ షహర్‌ స్థానంలో కాంగ్రెస్‌ తన ఓట్ల సంఖ్యను పెంచుకోగా, జాట్ల ఓట్లు మాత్రం బీజేపీ, ఆరెల్పీ మధ్య చీలాయి. దాంతో కాంగ్రెస్‌ 26 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గింది. అక్కడ ఆరెల్పీకి 46,628 ఓట్లు రావడం విశేషం. అంతకుముందు 2021లో వల్లభ్‌నగర్‌ ఉప ఎన్నికలోనైతే ఆరెల్పీ ఏకంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థినే రంగంలోకి దింపింది.

దాంతో ఆ పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది! సూజన్‌గఢ్‌ ఉప ఎన్నికలోనూ ఆరెల్పీ 32,210 ఓట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. దాంతో ఇక్కడా కాంగ్రెసే నెగ్గింది! అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల్లో గెలుపోటములకు మధ్య ఆరెల్పీయే ప్రధాన కారణంగా నిలిచే ఆస్కారం కనిపిస్తోంది. 

అసంతృప్తితో జాట్లు... 
రాజస్తాన్‌లో జాట్‌ సామాజికవర్గంలో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తమ కులానికి సంబంధించిన నేతే సీఎంగా ఉండాలని డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌స్, బీజేపీ చీఫ్‌లిద్దరూ జాట్లే ఉండేవారు. ఇటీవలే బీజేపీ సతీశ్‌ పునియా స్థానంలో సీపీ జోషిని రాష్ట్ర పార్టీ అధ్యక్షున్ని చేసింది. ప్రస్తుత అసెంబ్లీలో 39 మంది జాట్‌ ఎమ్మెల్యేలున్నారు. అందుకే రెండు ప్రధాన పార్టీలూ తమకు కనీసం 40 చొప్పున టికెట్లివ్వాలని జాట్‌ మహాసభ డిమాండ్‌ చేస్తోంది. 

ఎస్సీలు ప్రబల శక్తి 
రాజస్తాన్‌లో 34 ఎస్సీ రిజర్వుడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల కాంగ్రెస్, 12 స్థానాల్లో బీజేపీ నెగ్గాయి. తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఆరెల్పీ కేంద్రంలో ఎన్డీఏ కూటమితో జట్టు కట్టింది. బెణీవాల్‌ ఎంపీగా నెగ్గారు కూడా. కానీ రైతు చట్టాలపై విభేదించి బీజేపీకి దూరమయ్యారు. దీనికి తోడు ఆజాద్‌ పార్టీ కూడా రాష్ట్రంలో బీఎస్పీకి ఉన్న దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్‌లో బీఎస్పీ 6 స్థానాల్లో నెగ్గింది. తర్వాత వారంతా కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. కానీ ఆ తర్వాత దళితుల పట్ల కాంగ్రెస్‌ ద్రోహం చేసిందని ఆజాద్‌ ఆరోపిస్తున్నారు. 

బెనీవాల్‌.. రైతు నేత 
రాజస్తాన్‌లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్న హనుమాన్‌ బెనీవాల్‌ ప్రస్థానం ఆసక్తికరం. 1972లో నగౌర్‌లో ఓ జాట్‌ రైతు కుటుంబంలో పుట్టారు. రైతు నాయకునిగా ప్రసిద్ధుడైన బెనీవాల్‌ రాజకీయ జీవితం బీజేపీ కార్యకర్తగానే మొదలైంది! 2008లో ఆ పార్టీ తరఫున నగౌర్‌ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ నాటి సీఎం వసుంధరరాజె సింధియా సహా రాష్ట్ర బీజేపీ నేతల అవినీతిని, కాంగ్రెస్‌ నేతలతో వారి సాన్నిహిత్యాన్ని బాహాటంగానే ప్రశ్నించి పార్టీకి దూరమయ్యారు.

2013లో స్వతంత్ర ఎమ్మెల్యేగా నెగ్గారు. రాజస్తాన్‌లో సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరెల్పీని స్థాపించారు. అప్పట్లో పరిమిత స్థానాల్లోనే పోటీ చేసినా ఈ ఐదేళ్లలో చెప్పుకోదగ్గ శక్తిగా ఎదిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. నగౌర్‌ స్థానం నుంచి లోక్‌సభలో అడుగు పెట్టారు. కానీ ఎన్డీఏ సర్కారు తెచ్చిన రైతు చట్టాలను, అగ్నివీర్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆ కూటమికి దూరమయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశిస్తున్నారు. 

ఆజాద్‌... భీం ఆర్మీ నేత 
1986లో ఉత్తరప్రదేశ్‌లోని చుట్మల్‌పూర్‌లో జన్మించిన చంద్రశేఖర్‌ ఆజాద్‌ వృత్తిరీత్యా న్యాయవాది. సామాజిక కార్యకర్తగా వెలుగులోకి వచ్చారు. భీం ఆర్మీ సహ వ్యవస్థాపకుడు. ఈ సంస్థ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తుంటుంది. వారి కోసం పశి్చమ యూపీలో స్కూళ్లు తదితరాలు నడుపుతోంది. సహరన్‌పూర్‌ అల్లర్లలో జాతీయ భద్రతా చట్టం కింద ఆజాద్‌ జైలుకు వెళ్లారు. అనంతరం ఆజాద్‌ సమాజ్‌ పార్టీ స్థాపించారు. 2021లో టైం మేగజీన్‌ 100 మంది వర్ధమాన నేతల జాబితాలో చోటుచేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement