Prashant Kishor: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..

Prashant Kishor Explains What Steps Congress Party Need To Defeat BJP - Sakshi

కాంగ్రెస్‌లో పునర్‌వ్యవస్థీకరణ అవసరం 

పరస్పర నమ్మకం కుదరకే కాంగ్రెస్‌లో చేరలేదు 

2024లో బీజేపీని ఓడించడం సాధ్యమే 

రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్‌ కిశోర్‌ 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో జట్టు కట్టాలన్న ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల అనంతరం ఐదు నెలలపాటు చర్చలు జరిపానని, కానీ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తో చర్చలు, బీజేపీ ఓటమి తదితర అంశాలపై ఆయన ఎన్‌డీటీవీతో మాట్లాడారు.

ఒక సంస్థగా కాంగ్రెస్‌ పట్ల తనకు గౌరవభావం ఉందన్నారు. కాంగ్రెస్‌ లేకుండా దేశంలో ప్రభావవంతమైన ప్రతిపక్షం సాధ్యం కాదని ప్రశాంత్‌ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్‌కు అంత శక్తి లేదని, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌లో పునర్‌వ్యవస్థీకరణ అవసరమని చెప్పారు. కాంగ్రెస్‌లో తాను చేరాలనుకోవడం కేవలం ఏదో ఒక ఎన్నికల కోసం కాదని, పార్టీని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాలని తాను భావించానని చెప్పారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌లో చేరికపై దాదాపు రెండేళ్లు  చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు.

ఆ సమయంలో చాలామంది తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాననే భావించారన్నారు. కానీ ఇందుకు ఇరు పక్షాలు పరస్పర విశ్వాసంతో ఒకడుగు ముందుకు వేయాల్సిఉందని, కాంగ్రెస్‌తో అలా జరగలేదని చెప్పారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం తనకు చేదు అనుభవమని, అప్పటినుంచి కాంగ్రెస్‌లో చేరడంపై సందేహంగానే ఉన్నానని చెప్పారు. అలాగే తాను పూర్తిస్థాయిలో విశ్వాసపాత్రుడిగా ఉండనని కాంగ్రెస్‌ భావించిఉండవచ్చన్నారు.  
(చదవండి: బడ్జెట్‌ సమావేశాలపై బులెటిన్‌ విడుదల)

ఇలా సాధ్యం.. 
రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సరే, 2024లో ఆ పార్టీని ఓడించడం సాధ్యమేనని ప్రశాంత్‌ అభిప్రాయపడ్డారు. 2024లో ప్రతిపక్ష కూటమి బీజేపీని ఓడించేందుకు తాను సాయం చేయాలని భావించానని చెప్పారు.  అయితే ఇందుకు ప్రస్తుత పార్టీలు, నాయకత్వాలు, కూటములు పనికిరావని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పార్టీలు కొన్ని సర్దుబాట్లు, కొన్ని మార్పులు చేసుకుంటే బీజేపీని ఓడించవచ్చని, ఇందుకోసం కొత్తగా ఒక జాతీయస్థాయి పార్టీ పుట్టుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు.

దాదాపు 200 సీట్లున్న బీహార్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీకి దక్కినవి కేవలం 50 సీట్లేనని గుర్తు చేశారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లోని 350 సీట్లలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని, అందుకే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో విపక్షాలు సర్దుబాట్లు, వ్యూహాలతో వ్యవహరించి పైన చెప్పిన 200 సీట్లలో 100 సీట్లను కొల్లగొడితే ఇప్పుడున్న సీట్లతో కలిపి ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 200– 250ని చేరుతుందన్నారు. అప్పుడు బీజేపీని ఓడించేందుకు ఉత్తరాన లేదా పశ్చిమాన మరో 100 సీట్లు గెలిస్తేచాలన్నారు. ఈ వ్యూహంతో 2024లో ప్రతిపక్షాలకు సాయం చేయాలని తాను భావించానని ప్రశాంత్‌ చెప్పారు.  

ఆ మూడే బలం.. 
హిందుత్వ, అతి జాతీయవాదం, సంక్షేమాన్ని జతకలిపి బీజేపీ బలమైన ఆయుధం తయారు చేసుకుందని ప్రశాంత్‌ అభిప్రాయపడ్డారు. వీటిలో కనీసం రెండిటి విషయంలో ప్రతిపక్షాలు ప్రజలకు నమ్మకం కలిగిం చాల్సిఉందన్నారు. ఇది చేయకుండా మహా కూటమి పేరిట ఎన్ని పార్టీలు కలిసిపొత్తులు పెట్టుకున్నా ఉపయోగం ఉండదన్నారు. దేశంలోని ఎంపీ సీట్లలో దాదాపు 200 సీట్లలో కాంగ్రెస్‌– బీజేపీ మధ్యనే పోటీ ఉందని, వీటిలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ దాదాపు 95 శాతం సీట్లు గెలుస్తోందని గుర్తు చేశారు.

రాబోయే రాష్ట్రాల ఎన్నికలను 2024కు సూచికగా పరిగణించాల్సిన అవస రం లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవచ్చని చెప్పారు. యూపీలో బీజేపీపై గెలవాలంటే సోషల్‌ బేస్‌ను విస్తరించుకోవాలని సూచించారు. బీజేపీని ఓడించాలనుకునే పార్టీ లేదా నాయకుడికి కనీసం 5– 10ఏళ్లకు సరిపడా వ్యూహరచన ఉండాలని, ఐదు నెలల్లో అద్భుతాలు జరగవని చెప్పారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలన్నదే తన అభిమతమన్నారు. టీఎంసీకి సాయం చేయడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని, కాంగ్రెస్‌పై కక్షతో టీఎంసీకి సాయం చేశాననడం సరికాదని తెలిపారు. ఒక బడా పార్టీపై కక్ష కట్టే శక్తి తనకు లేదని, తను చాల చిన్న వ్యక్తినని చమత్కరించారు.   
(చదవండి: స్వామి ప్రసాద్‌ మౌర్య కుమారుడికి ‘నో ఛాన్స్‌’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top