వారికిచ్చే గౌరవం ఇదేనా.. సీఎం, ప్రియాంక గాంధీపై మోదీ ఆగ్రహం

PM Modi Serious Comments On Punjab CM Channi - Sakshi

ఛండీగఢ్‌ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని రూమ్‌నగర్‌ వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ ఛన్నీ, ప్రియాంక గాంధీ వాద్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఛన్నీ చేసిన వ్యాఖ్యలను మోదీ తప్పుబట్టారు. 

అయితే, బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చన్నీ..“Don't let UP, Bihar ke bhaiya enter Punjab.” ‘యూపీ, బీహార్‌ కే భయ్యాను పంజాబ్‌లోకి రానివ్వకండి’ అని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పక్కనే ఉండి నవ్వుతూ, చప్పట్లు కొట్టారు. దీంతో, చన్నీ, ప్రియాంకపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని ఎవరినీ రానివ్వరా అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు.

వారి వ్యాఖ్యలపై ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ.. సంత్‌ రవిదాస్‌ పంజాబ్‌లో జన్మించలేదు. యూపీలో పుట్టారు. అలాగే, గురుగోవింద్‌ సింగ్‌ కూడా పంజాబ్‌లో జన్మించలేదు. ఆయన బీహార్‌లోని పాట్నాలో జన్మించారు. వీరంతా పంజాబ్‌లో జన్మించలేదు. ఇప్పుడు మీరు వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని  ప్రశ్నించారు. సంత్‌ రవిదాస్‌ పేరును చెడగొడతారా అంటూ విమర్శలు గుప్పించారు. గురుగోవింద్‌ సింగ్‌కు జరిగిన అవమానాన్ని పంజాబ్‌ ప్రజలు సహిస్తారా అని అన్నారు. ఇలాంటి విభజన మనస్తత్వం ఉన్న వ్యక్తులను పంజాబ్‌ను పాలించడానికి అనుమతించకూడదని ప్రధాని మోదీ పంజాబీలను కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top