ఏపీని అవమానిస్తే చూస్తూ ఉండాలా? పవన్‌కు బీఆర్‌ఎస్‌పై ఇంత ప్రేమ ఎందుకు?: పేర్ని నాని

Perni Nani Slams Pawan Kalyan ForTelangana Ministers Comments - Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలంగాణ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. హరీష్‌ రావు ఏం మాట్లాడారో చెప్పకుండా.. ఏపీ మంత్రులు మాట్లాడటంపై పవన్‌ తెగ బాధపడుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఏపీని విమర్శిస్తే పవన్‌కు బాధ అనిపించడం లేదా అని మండిపడ్డారు. కన్నతల్లి లాంటి రాష్ట్రం గురించి మాట్లాడితే తాము మాట్లాడకూడదా అని సూటిగా ప్రశ్నించారు.

పేర్ని నాని ఏమన్నారంటే..

వైఎస్ఆర్సీపీకి వార్నింగ్ ఇస్తావా?    
తెలంగాణ ప్రజలపైగానీ, అక్కడి ప్రభుత్వంపైన గానీ మాకు ఏ కోపం లేదు. కానీ, పవన్ కు హఠాత్తుగా వారిపై ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చింది. ఏపీ మంత్రులకు, వైఎస్ఆర్సీపీకి వార్నింగ్ ఇస్తాడా..?. అంటే పవన్ కల్యాణ్ ఎవరికి వకాల్తా పుచ్చుకున్నాడు..?. ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు..?. అసలు తన పరిస్థితి ఏమిటో అద్దంలో చూసుకున్నాడా..?

పవన్‌కళ్యాణ్‌ ఈరోజు ఉదయాన్నే ఒక వీడియోలో తెలంగాణ మంత్రి మీద వైఎస్‌ఆర్‌సీపీ నేతలంటూ స్పందించాడు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే.. ఆయనకు ఒక అమాయకుడు యాభైలక్షలో లేదా రూ.కోటితో ఒక పెద్ద వ్యాన్‌ కొనిచ్చాడు. దాన్లో యాత్రకు సిద్ధమవుతుండగా, మరోపక్క చంద్రబాబేమో వద్దంటున్నాడు. ‘నా కొడుకు పాదయాత్ర చేస్తున్నందున.. నీ యాత్ర ఆపు అన్నాడేమో..’ అందుకని వారాహి వ్యాన్‌ కదలడంలేదు. మొదట్లో మాత్రం వారాహి వ్యాన్‌కు అటూ ఇటూ తలపాగాలు పెట్టుకుని వ్యక్తుల్ని పెట్టి  సినిమాస్టైల్‌లో టీజర్‌ను రిలీజ్‌ చేసుకున్నారు. తీరా, బండి బయల్దేరేముందు బాబు పర్మిషన్‌ లేకపోవడంతో వారాహి ఆరంభసూరత్వమైంది. 

ఇక రెండో కారణాన్ని పరిశీలిస్తే.. తెలంగాణపై పవన్‌కళ్యాణ్‌కు ఎనలేని స్వామిభక్తి పెరిగింది. ‘తెలంగాణలో ఒక మంత్రి ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆంధ్ర వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మాత్రం ఒక్కమాట కూడా అనడానికి వీల్లేదు..’ అని పవన్‌కళ్యాణ్‌ స్పందించాడు. మూడు నాలుగురోజులు దాటిన విషయాన్ని ఆయన ఈరోజు తెరమీదికి తెచ్చి వీడియో రిలీజ్‌ చేశారంటే.. ఇప్పుడే నిద్రలేచాడేమో.. అదీకూడా, ఆయనకు తెలంగాణ మంత్రి ఏం మాట్లాడారో తెలీదట.. ఆంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తప్పుబట్టడం మాత్రమే తెలిసిందంట. విషయాలపై కనీస స్పృహ, అవగాహన లేకుండా వపన్‌కళ్యాణ్‌ ఏదిబడితే అది అంటే.. విని నిజమనుకోవడానికి జనం అంత పిచ్చోళ్లు కాదుకదా..? ఆయన మనసుకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటో అనేది పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వివరంగా చెబితే మంచిది. 

హఠాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో..?
తెలంగాణ ప్రజలను మేము ఏమీ అనకపోయినా వైఎస్‌ఆర్‌సీపీపై పవన్‌కళ్యాణ్‌ బురద వేస్తున్నాడు. అసలు పవన్ కల్యాణ్ తెగ బాధ పడిపోవడానికి కారణమేంటో ఆయనే చెప్పాలి. ఆయనకు బీఆర్‌ఎస్‌పై హఠాత్తుగా  ప్రేమేంటో.. గతంలో ఆయన మాట్లాడిన మాటలేంటో ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది. గతంలో పవన్ కల్యాణ్ కేసిఆర్ గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి.. మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను పేర్ని నాని మీడియా ఎదుట ప్రదర్శింపజేశారు.  ‘రాష్ట్రాన్ని విడగొడితే ఆయనకు ఏడుపొచ్చిందని, 11 రోజులు అన్నం తినడం మానేశానని’ గతంలో పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగంలో స్వయంగా చెప్పాడు. మరి, ఇప్పుడు కొత్తగా తెలంగాణ పక్షాన ఈ ప్రేమలేంటో..? ఆయన కొత్త బాధలేంటి..?. తెలంగాణ - పవన్‌కళ్యాణ్‌ బంధం మళ్లీ ఎప్పుడు బలపడిందో.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరముంది.

కన్నతల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ను అవమానిస్తే పవన్ కు కోపం రాదా..?
‘ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా.. ఆంధ్రులకు పౌరుషం లేదా..? తెలంగాణ వాళ్ళ చేత.. తిట్టించుకుంటూ కూర్చోవాల్నా..?’ అని గతంలో ఇదే పవన్‌కళ్యాణ్‌ పలికిన పలుకులు అందరూ విన్నారు. ఇప్పుడు మాత్రం చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నాడు. తెలంగాణ మంత్రి తన ప్రసంగంలో కన్నతల్లిలాంటి ఆంధ్రప్రదేశ్‌ను అవమానిస్తూ మాట్లాడితే.. పవన్‌కళ్యాణ్‌కు కోపం రావట్లేదా..? ఆయనకు ఆంధ్రుల మీద ప్రేమలేదా..? ఆయన ఇల్లు, కాపురం అన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయని.. అక్కడ్నే సినిమాలు కూడా చేసుకుంటున్నాడని తెలంగాణపైనే ప్రేమ, గౌరవం చూపుతారా..? మరి, అలాంటప్పుడు ఆంధ్రరాష్ట్రంపై మమకారం లేని వ్యక్తి, రాజకీయ ప్రేమలెందుకు ప్రదర్శిస్తున్నాడని ప్రశ్నిస్తున్నాను. 

మీ రాజకీయాల కోసం అసత్యాల్ని వైఎస్‌ఆర్‌సీపీపై రుద్ది, లేనిపోని ఆరోపణలతో మామీద బురదజల్లడం పవన్‌కళ్యాణ్‌కు మంచిదికాదని  హితవు చెబుతున్నాను. మా నాయకులకు కేబుల్‌ వ్యాపారాలు లేవా.. మీరు హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకోరా..? అని తెలంగాణను వెనుకేసుకొచ్చే విధంగా పవన్‌కళ్యాణ్‌ కిరాయి మాటల్ని కట్టిబెడితే మంచిది. 

వకీలు కబుర్లు వద్దు
అంతకు ముందు చంద్రబాబు, లోకే శ్‌ను ఎవరైనా ఒక్కమాట అంటే...  తెగ బాధపడిపోతూ రెచ్చిపోయి మాట్లాడే పవన్‌కళ్యాణ్‌... ఇప్పుడేమో తెలంగాణ మంత్రులను ఏమైనా అంటే ఊరుకోడంట. పోనీ, బీజేపీకి సపోర్టుగా మాట్లాడటంలో అర్ధముంది. ఆ పార్టీ మిత్రపక్షంగా బీజేపీపై వచ్చే విమర్శలకు స్పందించొచ్చు. మొన్న ఢిల్లీ ఎందుకు వెళ్లాడో.. అక్కడ ఎవర్ని కలిశాడో .. అపాయింట్‌మెంట్‌లు ఎందుకు దొరకలేదో ఆయనకే తెలుసు. ఇప్పుడు ఎలాంటి సంబంధంలేకుండా తెలంగాణపై ప్రేమ ఒలకబోస్తూ కొత్తగా వకీలు వేషం వేసి, కబుర్లు ఎందుకు చెబుతున్నావు..?. రాష్ట్రంపై మమకారం, ప్రేమ లేనటువంటి రాజకీయాలు చేయడం ఏమేరకు సబబో పవన్‌కళ్యాణ్‌ ఆయన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి. 

కేసీఆర్‌ను తిట్టిన నోటితోనే..ఇలా
‘అరెయ్‌ కేసీఆర్‌.. నువ్వు నన్ను తిడితే నేను భరిస్తాను. ప్రధానమంత్రిని తిడితే మాత్రం తాటతీస్తాను..’ అని బహిరంగంగా ఒక సభలో పెద్దగా కేకలేసి మరీ తిట్టిన పవన్‌కళ్యాణ్‌.. ఈరోజు ఇలా భిన్నమైన స్వరం వినిపిస్తుండటంలో అంతర్యం ఏమిటో అందరికీ అర్ధమైంది. ఈరోజు తెలంగాణకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేస్తున్నాడంట.. ఆయన దృష్టిలో క్షమాపణలు ఎలా ఉంటాయంటే,  ‘అమ్మా కవిత.. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్పాల్నా.. క్షమాపణ చెప్పాల్నా వద్దా అనేది మా వ్యక్తిగత విషయం..’ అని గతంలో పలికాడు. అందుకే, ఈరోజు ఆయనకు మేమిచ్చే సమాధానం కూడా అదే.

తెలంగాణపై ప్రేమకు కారణం ఏంటో రాధాకృష్ణ చెప్పాడు
 తెలంగాణపై గతంలోలేని ప్రేమ, ఎనలేని గౌరవాన్ని పవన్‌కళ్యాణ్‌ ప్రదర్శించడంలో ఆంతర్యమేంటో.. చంద్రబాబు గుండెకాయ, పవన్‌ రహస్య స్నేహితుడైన ఏబీఎన్‌ రాధాకృష్ణ ఇప్పటికే చెప్పాడు. ‘రూ.వెయ్యికోట్లు ఖర్చయినా పర్లేదు మీరు నాతో చేతులు కలపండి అని పవన్‌ వద్దకు కేసీఆర్‌ దూతల్ని పంపాడు..’ అని ఏబీఎన్‌ రాధాకృష్ణ పలుకుల్లో అందరూ విన్నారు. కనుక, ఇప్పటికైనా పవన్‌ లోపాయికారీ ఒప్పందాల్ని బయటపెట్టి రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తే బాగుంటుంది. అంతేగానీ, లేనిపోని ఆరోపణలతో అటు చంద్రబాబు కోసమో.. ఇటు తెలంగాణ కోసమో రాజకీయం నడపడం పద్ధతికాదు. ‘ఈ రాష్ట్రంపై ప్రేమ చూపిస్తే.. ఇప్పుడు మీ అభిమానులు చూపుతున్న మమకారానికి కొంతైనా అర్ధం ఉంటుంది.’

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ గాలికబుర్లు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశామని కేంద్రమంత్రి ఒకరు అనగానే పవన్‌కళ్యాణ్‌ పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి ‘ఢిల్లీపెద్దలకు నేనే చెప్పి అనిపించాను..’ అన్నాడు. ఇంతలోనే మరోమారు కేంద్రం స్పందిస్తూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం ఆరునూరైనా ఆగే ప్రసక్తేలేదని స్పష్టం చేయడంతో పవన్‌కళ్యాణ్‌ గమ్మున కూర్చొన్నాడు. మొదట్నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పవన్‌కళ్యాణ్‌ చెప్పేవన్నీ గాలికబుర్లుగానే చూడాలి. గాలికిపోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నట్టు పవన్ కల్యాణ్ తీరు ఉంది. ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే.. ఢిల్లీ వెళ్ళి నిలదీయాలి కదా.. ఆయన మొన్నామధ్య తన బంధువులు సింగపూర్ నుంచి వస్తున్నారని వెళ్లి, అందుబాటులో ఉన్న ఒకరిద్దరు మంత్రుల్ని కలిసి మమ అనిపించారు. ఆయన బీజేపీ పెద్దల్ని ఢిల్లీలో కలిసినప్పుడు ఏం అంశాలపై మాట్లాడుతున్నాడో.. ఆయన అంతరాత్మకే తెలియాలి. 

వివేకానందరెడ్డి  హత్య కేసుకు సంబంధించి.. మీడియా ప్రశ్నలకు సమాధానాలిస్తూ...

వక్రమార్గంలో సీబీఐ విచారణ
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ వక్రమార్గంలో జరగుతుందని మేం భావిస్తున్నాం. రాజకీయంగా దురుద్దేశాలను అపాదిస్తూ కేసును రకరకాల మలుపులు తిప్పి తాత్కాలికంగా మా నాయకుల్ని ఇబ్బందిపెట్టినా.. అంతిమంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాత్రం మాకుంది. ఈకేసుకు సంబంధించి వాస్తవాల్ని, రాజకీయ దురుద్దేశాలతో విచారణ జరుగుతున్న తీరును కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఇప్పటికే మీడియా ద్వారా వివరించారు. సీబీఐ ఢిల్లీకి ఎవరెవరిని పిలిపించుకుని .. ఏం మాట్లాడించారో.. ఏమేమి కాగితాలు మాయం చేశారో.. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ తీరును సాక్షాత్తూ సుప్రీంకోర్టు తప్పుబట్టినా కూడా ఆ తర్వాత వచ్చిన అధికారి అదే పద్ధతిలో ముందుకెళ్లడం కనిపిస్తుంది. 

చంద్రబాబు కనుసన్నల్లోనే అంతా..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్‌మోహన్‌రెడ్డి గారిపై హత్యాయత్నం జరిగితే ప్రాథమిక దర్యాప్తులో ఆయన ఏం చేశాడో.. ఘటన జరిగిన గంటలోపే రాష్ట్ర డీజీపీ వచ్చి అది ఉత్తుత్తి దాడి అని చెప్పారంటేనే అప్పట్లో ప్రజలందరికీ అర్ధమైంది. అలాగే, ఇప్పుడు వివేకా హత్యకేసుకు సంబంధించి కూడా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తుందనే అనుమానాలు మాకున్నాయి.  చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని ఏమార్చి వశపరుచుకోవడంలో సిద్ధహస్తుడు. వివేకా కూతురు  సునీతగారు, రామ్‌సింగ్‌లు కలిసి చంద్రబాబు చెప్పినట్లు వింటూ నడుస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అనుమానిస్తుంది. ఏమార్చడం, పిల్లిమొగ్గలేయడం చంద్రబాబు నైజం అని గతంలో ఎన్టీరామారావు గారు ఈయన నక్కవినయాల్ని పూసగుచ్చినట్లు చెప్పారు కదా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top