సాక్షి, గుంటూరు: ముప్పై ఏళ్లపాటు జెండా మోసి గెలిపించిన కాపులపై దాడులు చేయించడానికి.. తప్పుడు కేసులు పెట్టించడానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మామిళ్లపల్లి ఘటనను ప్రస్తావిస్తూ శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మామిళ్ళపల్లిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మనుషుల్ని పంపి ధూళిపాళ్ల నరేంద్ర మామిళ్ళపల్లి పంపి మొక్కజొన్న రైతులపై దాడులు చేయించారు. ఆడా మగా తేడా లేకుండా ఆ రైతులపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం పేరిట తప్పుడు కేసులు పెట్టించారు. ఇది చూసి.. కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసులు కూడా ‘అరే మనం ఇంత దిగజారి పనిచేస్తున్నామా?’ బాధపడుతున్నారు.
టీటీడీకి నకిలీ నెయ్యా?
ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు, కృష్ణాజిల్లాలో గేదే పాలు సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అమ్ముకుంటున్నారు. గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు?. సంగం డెయిరీ.. వైష్ణవి డెయిరీ ఈ రెండూ ఒకటి కాదా?. వైష్ణవి డెయిరీ తప్పు చేసిందని సాక్షాత్తు సీబీఐనే చెప్పింది కదా అని పేర్ని నాని అన్నారు.
ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డెయిరీ అంటే ఎంత ప్రాణమంటే.. ఆ డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించడం చంద్రబాబు వల్ల కూడా కాలేదు. ‘నీకు మంత్రి పదవి కావాలా? సంగం డెయిరీ కావాలా?’ అని చంద్రబాబు అడిగితే.. మరో మాటే లేకుండా పాల డెయిరీనే ధూళిపాళ్ల ఎన్నుకున్నారు. తన అనుచరులతో క్వింటా మొక్కజొన్న రూ.1600 కొని.. సంగం డెయిరీలో రూ.2100 కొంటున్నట్లు ఆయన రాయించుకుంటున్నారు.
కాపులు ఉంది అందుకేనా?..
ముప్ఫై ఏళ్లు నీకు జండా మోసిన కాపులపై దాడి చేయిస్తావా? అంటూ ధూళిపాళ్లపై పేర్ని నాని ఫైరయ్యారు. అదే సమయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపైనా మండిపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్‌ను చూసి కాపులంతా కూటమికి ఓటేశారు. ఇప్పుడేమో కాపులపై అక్రమ కేసులు బనాయిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. కాపులను ఇంత చావబాదుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించరు. పైగా కూటమి ప్రభుత్వంలో ఉన్న రెండున్నరేళ్లు సీఎం అవుతారని కాపులు ఆశిస్తే.. ఆయనేమో మరొక 15 సంవత్సరాలు చంద్రబాబును మోయాలి అని కాపులకు పిలుపు ఇస్తున్నాడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

కాపుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్న పేర్ని నాని.. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాపు రైతులపై పెట్టిన అక్రమ ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.


