సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..
పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలు
ఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?
పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?
చంద్రబాబు అనుభవం ఏమైంది?
కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.
లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.
వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.



