టీడీపీని ఎన్టీఆర్‌ కుటుంబానికి అప్పగించు బాబూ!

Peddireddy Ramachandra Reddy Slams On Chandrababu Over Kuppam Municipality - Sakshi

వెన్నుపోటుతో హస్తగతం చేసుకున్న పార్టీని భూస్థాపితం చేశావు

కుప్పంలో తండ్రీకొడుకుల్ని ప్రజలు ఛీకొట్టారు

సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాలే వైఎస్సార్‌సీపీని గెలిపించాయి

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: టీడీపీని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు అప్పగించి, చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు ఛీత్కరించడంతో టీడీపీ శాశ్వతంగా భూస్థాపితమైందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు.

టీడీపీ చంద్రబాబు సొంత పార్టీ కాదని, ఎన్టీఆర్‌ స్థాపిస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ ప్రాణాలు పోవటానికి కారణమైన వ్యక్తి.. ఇప్పుడు పార్టీని కూడా అసమర్థతతో నాశనం చేశాడని విమర్శించారు. ‘ఇప్పటికే చంద్రబాబుకు 72 ఏళ్లు వచ్చాయి. తక్షణమే కుప్పం ఫలితాలతోనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, తనయుడు లోకేశ్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కుప్పం మునిసిపల్‌ కౌంటింగ్‌ను స్పెషల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో రికార్డు చేయాలంటూ హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, తీరా ఫలితాలను చూసి వైఎస్సార్‌సీపీ మ్యానిప్యులేట్‌ చేసిందంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని మండిపడ్డారు. 

చంద్రబాబు ఇక కుప్పంలో పోటీ చేస్తాడనుకోవడం లేదు
వైఎస్సార్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చూసిన చంద్రబాబు తన కొడుకు లోకేశ్‌ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని మదనపడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పంలో ఓటమి భయంతోనే పోలింగ్‌కు ముందు తమను దుర్భాషలాడారన్నారు. ‘లోకేశ్‌ అయితే పెద్దిరెడ్డి గాడు అని మాట్లాడారు. మా నాన్న చాలా సాఫ్ట్‌. నేను పెద్ద రౌడీని’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రౌడీలు కాబట్టే కుప్పంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపల్‌ ఎన్నికల్లో వారిని ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారన్నారు.

మరోసారి చంద్రబాబు, లోకేశ్, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తానంటూ మంత్రి హెచ్చరించారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ ఓటమితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవటం లేదన్నారు. తనను టార్గెట్‌ చేస్తూ పుంగనూరులో పోటీ చేయాలనుకుంటే ఆహ్వానిస్తామన్నారు. తామెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టే చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారన్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడు చంద్రబాబు తనకు సీనియర్‌ అని, తాము వేర్వేరు గ్రూపులకు నాయకులుగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే తాను యూనివర్సిటీకి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌ అయ్యానని, అప్పుడు పోటీ ఎందుకు పెట్టలేదో చంద్రబాబునే అడగాలని పెద్దిరెడ్డి చెప్పారు. 

మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ నేతలకు సీఎం జగన్‌ అభినందనలు
సాక్షి, అమరావతి: కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అభినందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి పెద్దిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top