చంద్రబాబు తీరుపై పనబాక అసంతృప్తి 

Panabaka Lakshmi Dissatisfied With Chandrababus Attitude - Sakshi

చెప్పాపెట్టకుండా అభ్యర్థిత్వం ప్రకటన ఏమిటో? 

బీజేపీలో చేరే సమయంలో ఇదో తలనొప్పా! 

సోమిరెడ్డి మంతనాలు.. డిమాండ్లు ముందుంచిన లక్ష్మి 

‘ఎందుకు నాకు ఈ తలనొప్పి. క్షేత్రస్థాయిలో పార్టీకి గడ్డు పరిస్థితులున్న సమయంలో అభ్యర్థిత్వాన్ని చెప్పాపెట్టకుండా ప్రకటించారు. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకుంటే ఇదొక భారాన్ని నెత్తినపెట్టారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేలో అర్థం కావడం లేదు. ఆయన (చంద్రబాబు) తీరు ఏం బాగోలేదు.. నా డిమాండ్లు పరిష్కరిస్తేనే తిరుపతి ఎంపీగా పోటీ చేస్తా’నన్నట్టు ఉంది ఆ పార్టీ అభ్యర్థి పనబాకలక్ష్మి మనోగతం. అభ్యర్థిత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని బట్టి చూస్తే ఆమె తమ పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.  

సాక్షి, తిరుపతి: తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని మాత్రం అందరికంటే ముందే ప్రకటించింది. ఉప ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పనబాకలక్ష్మిని ముందే ప్రకటించడానికి కారణం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో టీడీపీకి గడ్డు రోజులు నడుస్తున్న తరుణంలో మాజీ మంత్రి పనబాకలక్ష్మి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా బీజేపీ పెద్దలతో కూడా సంప్రదింపులు నెరిపి తేదీ కూడా ఖరారు చేసుకున్నట్లు తెలిసింది.  

షాక్‌ ఇచ్చిన చంద్రబాబు 
పనబాకలక్ష్మి బీజేపీలో చేరుతుందని తెలుసుకున్న చంద్రబాబు ఆమెను సంప్రదించకుండా తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు తీరుతో ఆమె షాక్‌కు గురైనట్లు సమాచారం. టీడీపీ అధినేతపై తీవ్ర అంసతృప్తితో మౌనంగా.. కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అభ్యర్థిత్వం ప్రకటించినా ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. తనను సంప్రదించకుండా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకునే అవకాశందని ఉందని టీడీపీ అధిష్టానానికి సమాచారం అందింది. వెంటనే చంద్రబాబు సోమిరెడ్డిని రంగంలోకి దింపారు. అందులో భాగంగా ఆయన పనబాకలక్ష్మితో భేటీ అయ్యారు. అయితే ఆమె కొన్ని డిమాండ్లు టీడీపీ అధిష్టానం ముందుంచింది. వాటిని ఆమోదించాలా? వద్దా? అనే సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.   (తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు)

బీజేపీతో లోపాయికారి ఒప్పందమేనా? 
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ముందు నొయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. వైఎస్సార్‌సీపీ ధాటికి తట్టుకోలేక బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పనబాకలక్ష్మి డిమాండ్లను ఆమోదించినట్లే ఆమోదించి.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అటు బీజేపీ, ఇటు టీడీపీకి సన్నిహితంగా ఉండే మాజీ ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు పట్ల మొగ్గుచూపుతున్నట్లు కమలం శిబిరం నుంచి అందిన సమాచారం. ఆయన్ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు కూడా ఆయనకే మద్దతు తెలిపాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ద్వారా బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు టీడీపీ క్యాంప్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఏదేమైనా పనబాకలక్ష్మికి చంద్రబాబు మరో సారి షాక్‌ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top