MLC: వచ్చే ఏడాది 17 ఎమ్మెల్సీలు ఖాళీ.. గెలుచుకునే అవకాశాలు ఇలా.. 

Next Year 17 MLAs will be Vacant In Maharashtra Legislative Council - Sakshi

2022లో ముగియనున్న 17 మంది ఎమ్మెల్సీల పదవీకాలం 

ఎన్నిక తర్వాత మారనున్న మండలి రాజకీయ ముఖచిత్రం 

ఇప్పటికే మండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా

ముంబై: మహరాష్ట్ర శాసన మండలిలో వచ్చే ఏడాది 17 స్థానాలు ఖాళీ కానున్నాయి. 2016లో ఎన్నికైన 17 మంది ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఈ 17 మందిలో పదిమంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడిన వారు కాగా, మిగతా ఏడుగురు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ముగియనుండటంతో వచ్చే ఏడాది జరిగే మండలి ఎన్నికల తర్వాత మహరాష్ట్ర శాసన మండలి రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శాసన సభలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం బీజేపీ నాలుగు ఎమ్మెల్సీలు, శివసేన, ఎన్సీపీలు చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే అవకాశాలుండగా, కాంగ్రెస్‌ ఒక ఎమ్మెల్సీని గెలుచుకునే అవకాశముంది.

ఇలా తొమ్మిది సీట్లు బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు గెలుచుకున్నా పదవ సీటు కోసం మాత్రం గట్టి పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వతంత్రులు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు పలికితే పదో స్థానం కూడా కాంగ్రెస్‌ ఖాతాలో పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రకంగా మహా ఆఘాడికి చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా గెలిచే అవకాశాలున్నాయి. పదవీ కాలం ముగియనున్న సభ్యుల్లో రామ్‌రాజే నాయిక్‌ నింబాల్కర్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్‌ దేశాయ్‌కి మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి వయస్సు ఎక్కువగా ఉండటం వల్ల మళ్లీ అవకాశం దక్కకపోవచ్చని, వారిద్దరికి ఉన్న రాజకీయ అనుభవాన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చినా ఇవ్వొచ్చని పలువురు విశ్లేషణలు చేస్తున్నారు.  

చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయిన ప్రియుడు)

బీజేపీ నుంచి ఎనిమిదిమంది.. 
పదవీకాలం ముగియనున్న సభ్యుల్లో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారుకాగా, శివసేనకు చెందిన నలుగురు, ఎన్సీపీకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. తన సంఖ్యాబలాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నించవచ్చు. శాసన సభ సభ్యుల ద్వారా బీజేపీకి చెందిన నలుగురు సభ్యులు ఎన్నిక కావొచ్చు. స్థానిక స్వపరిపాలనా సంస్థల నియోజక వర్గాల సంఖ్యాబలం కాగితాలపై కనిపించదు. ఎక్కువ ప్రభావం కలిగిన వ్యక్తులు గెలుస్తారు. గవర్నర్‌ కోటాలో నియమించే 12 మంది సభ్యుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొత్త ఏడాదిలో మరో 17 మంది నూతనంగా ఎన్నిక కానున్నారు. దీంతో శాసన మండలి ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

చదవండి: (రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌ సూపర్‌ సక్సెస్‌)

ఎవరెవరి పదవీ కాలం ముగియనుందంటే.. 
వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలలో బీజేపీకి చెందిన ప్రవీణ్‌ దరేకర్, సదాభావు ఖోత్, సుజీర్త్‌సహ్‌ ఠాకూర్, వినాయక్‌ మోరే, ప్రసాద్‌ లాడ్, రామ్‌నివాస్‌ సింగ్, చందూభాయి పటేల్, పరిణయ్‌ ఫుకే ఉన్నారు. శివసేనకు చెందిన ఎమ్మెల్సీల్లో సుభాశ్‌ దేశాయ్, దివాకర్‌ రావ్‌తే, రవీంద్ర ఫాటక్, దుష్యంత్‌ చతుర్వేది తదితరుల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఎన్సీపీ నుంచి సంజయ్‌ ధౌండ్, రామ్‌రాజే నాయిక్‌ నింబాల్కర్, అనిల్‌ భోంస్లేల పదవీ కాలం ముగియనుండగా.. కాంగ్రెస్‌ నుంచి మోహన్‌ కదం, అమర్‌ రాజుర్కర్‌ల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top