కేసీఆర్‌ చెప్పినా కూడా ఎమ్మెల్యేల కాళ్లులాగే ప్రయత్నాలు.. ఛాన్స్‌ దొరికితే జగడమే!

Nagarjuna Sagar: BRS Party MLC MC Koti Reddy Vs MLA Nomula Bhagat - Sakshi

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ బీఆర్ఎస్ పార్టీలో లొల్లి ఎక్కువవుతోంది. టిక్కెట్ల పోరు తీవ్రమవుతోంది. సిటింగ్‌లకే సీట్లని కేసీఆర్ ప్రకటించాక కూడా ఎమ్మెల్యేల కాళ్ళులాగే ప్రయత్నాలు ఆగడంలేదు. నాగార్జునసాగర్లో ప్రస్తుతం మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తలనొప్పులు పెరిగాయట. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు వర్గపోరుతో పాటు.. కొత్త తలనొప్పులు మొదలయ్యాయని టాక్.

సొంత వర్గం నేతలు కూడా ఎమ్మెల్యే మాటల్ని పెడచెవిన పెడుతూ బహిరంగంగా కయ్యానికి కాలు దువ్వుతున్నారట. ఇప్పటికే సాగర్ బీఆర్ఎస్ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో అక్కడ పార్టీ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా విడిపోయాయి.

రెండు గ్రూపులకు తోడు మధ్యలో మరో నేత రావడంతో ఇప్పుడు మూడు ముక్కలాట సాగుతోంది. ఈ పరిస్థితుల్లో సొంత వర్గాన్ని కాపాడుకుంటూ.. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎమ్మెల్యేలకు సమయం సరిపోవడంలేదట. అంతా గందరగోళంగా మారడంతో సొంత వర్గం నుంచి కూడా ఎమ్మెల్యే భగత్‌కు సమస్యలు ఎదురవుతున్నాయట. ఇవన్నీ చూసి ఎమ్మెల్యేకు తలబొప్పి కడుతోందని టాక్. 
చదవండి: తేరా చిన్నపరెడ్డి రాజకీయ అదృష్టమెంత? కారులో సీటుందా?

ప్రచారంతో వివాదం
ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పంచాయితీ కొనసాగుతున్న తరుణంలోనే.. సొంత వర్గానికి చెందిన చోటా నేతలు చేస్తున్న హంగామా ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే బజారుకెక్కి బట్టలు చింపుకుంటుండటంతో ఏం చేయాలో అర్థం కావడంలేదట. సొంతవర్గంలోని గొడవలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే ఆందోళన పడుతున్నారని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు.

తాజాగా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో అభిమానులు పెట్టినట్లుగా ఫ్లెక్సీలను ఊరంతా నింపేశారట. వాటిలో ఒకచోట నిడుమనూరు ఎంపీపీ జయమ్మ ఫోటో పెట్టలేదట. దీంతో ఆమె అనుచరులు కొందరు అక్కడకు చేరుకుని నానా హంగామా చేశారు. తమ నేత ఫోటో లేకుండా ఫెక్సీలు పెడతారా? మీకెంత ధైర్యం అంటూ అందులో తమ నాయకుడు భగత్ ఫోటో ఉందన్న విషయం కూడా మర్చిపోయి వాటిని చించేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయట. 

సోషల్ మీడియాలో వైరల్
అసలు ఏం జరుగుతుందో అర్థంకాక కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి సర్ధిచెప్తున్నా ఎంపీపీ అనుచరుడు వినిపించుకోకుండా రోడ్డుపైనే గొడవకు దిగారట. దాదాపు గంట పాటు ఈ గొడవ జరగడంతో పార్టీ పరువు పోతుందని అక్కడే ఉన్న ఓ నాయకుడు ఎమ్మెల్యేకు విషయం చేరవేశాడట. దీంతో ఎమ్మెల్యే సీరియస్ అయి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా సదరు నేత వెనక్కి తగ్గలేదట.

మరోవైపు ఇదే అవకాశమని వైరి వర్గం ఆ వీడియోను విస్తృతంగా వైరల్ చేసేసిందట. దీంతో ఒక్కసారిగా నాగార్జున సాగర్ లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇది మీడియాలో కూడా రావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎమ్మెల్యే ఎంపీపీతో వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఇన్నాళ్లు అక్కడ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నువ్వా నేనా అన్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రాజకీయాలు సాగుతున్నాయి. వీరి పోరుతోనే పార్టీ పరువు సాగర్‌లో కలుస్తోందని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ తాజాగా ఎమ్మెల్యే వర్గానికి చెందినవారే రొడ్కెక్కడంతో ఏంటీ కొత్త గోల అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. అసలే భగత్ ఎక్కడ దొరుకుతాడా కసి తీర్చుకుందాం అని ఎదురుచూస్తోన్న ఎమ్మెల్సీ వర్గానికి ఎమ్మెల్యే సొంత వర్గమే వారికి ఇప్పుడో ఆయధం ఇచ్చినట్లు అయిందట. మొత్తానికి అందరూ కలిసి పార్టీ పరువును సాగర్‌లో కలిపేస్తున్నారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.

-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top