కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి?

Nagam Janardhan Reddy Will Resign From Congress Party - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్‌ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి మంత్రి కేటీఆర్‌ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్‌ నేతలకే టికెట్లు ఇచ్చిందని మాజీమంత్రి, పార్టీ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్‌ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు.

తనకు పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్‌కర్నూల్‌లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్‌ ఇచ్చిందని చెప్పారు. బోగస్‌ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలెవరైనా తనను సంప్రదిస్తే, కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు.

చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top