Munugode By Election 2022: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ

Munugode By Election 2022 Schedule Released BJP Campaign Plans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఎన్నికల సమరానికి కమలదళం ఫుల్‌జోష్‌తో సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బహిరంగసభల్లో వారు పాల్గొంటారు. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ నాయకులు ఇక్కడ విస్తృతంగా పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలింగ్‌కు సరిగ్గా 30 రోజులే ఉండడంతో దసరా తర్వాత శుక్రవారం నుంచే మునుగోడులోని 6 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం పార్టీ యంత్రాంగాన్ని మోహరించనుంది. ఎన్నికల సమన్వయానికి జి.వివేక్‌ వెంకటస్వామి చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలతో బీజేపీ ఎలక్షన్‌ స్టీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పర్యవేక్షణలో పనిచేసేందుకు 6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మొత్తం 24 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను నియమించింది. వీటి పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు ఇన్‌చార్జీలుగా పార్టీనాయకులు, కార్యకర్తలను ఏర్పాటు చేసింది.

ఈ నియోజకవర్గంలోని 298 పోలింగ్‌బూత్‌లకు గాను ఒక్కో దాంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించింది. అయితే.. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బహిరంగసభల కంటే ప్రతి ఓటర్‌ను కలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి తెలిపారు.  నియోజకవర్గ పరిధిలో చిన్న చిన్నసభలు అధికంగా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున ఇక్కడ చేపట్టాల్సిన బైక్‌ర్యాలీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top