సోషల్‌ మీడియా పోస్టులకు బెదిరిపోను

Mudragada Padmanabhan open letter to Andhra Pradesh People - Sakshi

నా లేఖలకు కొందరు పెద్దలు భుజాలు తడుముకుంటున్నారు

నల్లటి బురద పూసుకుని ఇతరులకు అంటిస్తున్నారు

ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

గోకవరం: తనను తిడుతూ సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులకు బెదిరిపోనని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా పైకి లేస్తుందన్నారు. అలాగే ఎవరో తిడుతున్నారని బలమైన ఆలోచనలను తాను వదలి పెట్టనన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాకు విడుదల చేశారు. ఇటీవల తాను రాసిన లేఖలకు కొంతమంది పెద్దలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.

తన న్యాయమైన ఆలోచనలను అమలు చేయొద్దని చెప్పడానికి ఇతరులెవరికీ హక్కు లేదన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటిస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే వారిని దగాకోరులు, దొంగలు అని చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనను సోషల్‌ మీడియాలో దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి ప్రముఖుల గురించి ఒక మాట రాసినా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిని మంచి అని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు.

తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తోందని గుర్తు చేశారు. 1989 నుంచే తనకు ఎన్నో ఆశలు, ఆలోచనలు ఉన్నాయన్నారు. ఐదేళ్ల క్రితం దళిత నేత డాక్టర్‌ రత్నాకర్‌ తన వద్దకు వచ్చి మూడో ప్రత్యామ్నాయం గూర్చి మాట్లాడారని తెలిపారు. అలాగే రెండేళ్ల క్రితం బీసీ నేత కుడుపూడి సూర్యనారాయణరావు ‘నిత్యం ఒకే బొమ్మ కాదు, బొమ్మ తిరగేయాలి’ అని తనతో చెప్పారన్నారు. రత్నాకర్‌ లేవనెత్తిన విషయాన్ని సూర్యనారాయణతో చర్చించానని తెలిపారు. చిన్న ప్రయత్నంగా ప్రత్యామ్నాయం అనేదాన్ని మొదలు పెడదామని చెప్పానన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top