
సాక్షి, తాడేపల్లి: కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కరేడులో భూసేకరణ గ్రామ సభలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భూసేకరణ పేరుతో మళ్ళీ హడావుడి చేస్తున్నారు. గ్రామంలోని ఎస్టీలను భయపెట్టి భూసేకరణ చేయాలని చూస్తున్నారు. గత భూసేకరణ గ్రామ సభలో అభ్యంతరం తెలిపిన ఒక మహిళ మీద అక్రమంగా కేసులు పెట్టించారు
ఈ కేసులో ముగ్గురు ఎస్టీ మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా?. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి. ప్రజల అనుమతి లేకుండా భూసేకరణ చేస్తామంటే కుదరదు. బలవంతపు భూసేకరణ, అర్థరాత్రి ఎస్టీ మహిళలను అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో లేవనెత్తుతాం’ అని వ్యాఖ్యలు చేశారు.
