MLC Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్‌ రెడ్డి

MLC Jeevan Reddy On Komatireddy Raj Gopal Reddy After Resigns To Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కౌరవుల పక్షాన చేరిన కర్ణుడని ఆయన అభివర్ణించారు. పాండవుల వెంట ఉంటే రాజ్యం ఇస్తామని చెప్పినా అనాడు కర్ణుడు విననట్లు.. ఇప్పుడు రాజగోపాల్‌ కూడా అలాగే చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడమంటే చేతకానీతనమేనని జీవన్‌ రెడ్డి విమర్శించారు. రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు.  హుజురాబాద్‌కు, మునుగోడుకు సంబంధమే లేదని, రాజగోపాల్‌రెడ్డి ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టడని జోస్యం చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్‌ రెడ్డి ఉపయోగించుకోలేదని మండిపడ్డారు. గత మూడేళ్లలో రాజగోపాల్‌రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏదైనా ఉందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి ఫైట్‌ చేస్తామంటే కాంగ్రెస్‌ అడ్డుపడిందా అని నిలదీశారు.
చదవండి: కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో టీ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని జీవన్‌ రెడ్డి వెల్లడించారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్క.. ధర్మరాజు అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడని, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును అర్జునుడిగా పేర్కొన్నారు. రాజగోపాల్‌ రెడ్డిని కర్ణుడితో పోల్చారు.

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. ఎమ్మెల్యేలు అందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మీటింగ్‌లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
చదవండి: జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top