ఒక్క హామీనీ అమలు చేయని సీఎం: ఈటల 

MLA Etela Rajender Criticized Telangana CM KCR - Sakshi

నల్లగొండ టూటౌన్‌: గత ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటుతో తెలంగాణ సమాజంతో కేసీఆర్‌కు బంధం తెగిపోయిందన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజాగోస బీజేపీ భరోసా’బైక్‌ యాత్రను ఈటల ప్రారంభించి మాట్లాడారు.

కేసీఆర్‌ ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా లేని కేసీఆర్‌.. దేశాన్ని బాగుచేస్తానని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడం కాదా? అని ప్రశ్నించారు. సురక్షితంగా, సుభిక్షంగా పాలించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని గుజరాత్‌ ఎన్నికలు మరోసారి నిరూపించాయన్నారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని ఈటల స్పష్టంచేశారు.

మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను కేసీఆర్‌ మోసం చేయలేరని చెప్పారు. మునుగోడులో రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి వేలాది హామీలిచ్చినా చావు తప్పి కన్నులొట్టపోయి గెలిచారని ఎద్దేవాచేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, కిసాన్‌ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top