చంద్రబాబుకు దమ్ముంటే మోదీ ఎదుట ధర్నా చేయాలి

Minister Kodali Nani Fires On BJP Over Petrol Price Hike At Amaravati - Sakshi

ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ ఎదుట ధర్నా చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్‌ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రో ధరల పెంపుపై చంద్రబాబు నిరసనలు చేయాల్సింది రాష్ట్రంలోని బంకుల వద్ద కాదని, గతంలో డ్రామాలు చేసినట్టుగా నల్ల చొక్కా వేసుకుని ఢిల్లీలో ధర్నా చేయాలని హితవు పలికారు. పెట్రోల్‌ బంకులపై ఏదో ఒక విధంగా దాడులు చేసేందుకు నిరసన దీక్ష చేపడుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుని తిరిగే వృద్ధ జంబూకం చంద్రబాబు కూడా బీజేపీకి తోక పార్టీగా తయారై ప్రైవేట్‌ వ్యక్తులు నడిపే బంకుల దగ్గర నిరసన చేయాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.   

అలా చేస్తే ప్రజలు కనికరించరు 
పెట్రోల్, డీజిల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా పెంచేసి ప్రజలకు వాతలు పెట్టిందని, ఇప్పుడు రూ.5 లేదా రూ.10 తగ్గించి, ఆయింట్‌మెంట్‌ పూసినంత మాత్రాన ప్రజలు కనికరిస్తారనుకోవడం బీజేపీ నేతల పిచ్చి భ్రమే అవుతుందని నాని పేర్కొన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి అదే పెట్రోల్, డీజిల్‌ మంటల్లో ప్రజలు తగులబెట్టారని విమర్శించారు.  బీజేపీ ఎంత పెంచింది, ఎంత తగ్గించింది ప్రజలకు తెలుసన్నారు. సీఎం జగన్‌ పెంచిన రూ.1 సెస్‌లో 78 పైసలు తగ్గించాలా అని ప్రశ్నించారు. పేదల రక్తం పీలుస్తున్న జలగలు బీజేపీ నేతలని దుయ్యబట్టారు. 

ప్రజల నుంచి లూటీ చేసిన దుర్మార్గుడు బాబు 
రాష్ట్రంలో రోడ్లు వేస్తానని, మరమ్మతులు చేస్తానని గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారని మంత్రి గుర్తు చేశారు. చివరకు రోడ్లు వేయకపోవడం, ఆ అప్పు తీర్చకపోవడం వల్లే ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌పై రూ.1 సెస్‌ విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో నాలుగున్నరేళ్ల పాటు లీటర్‌కు రూ.2 చొప్పున సర్‌చార్జి వేసి దాదాపు రూ.10 వేల కోట్లను ప్రజల నుంచి లూటీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల ముందు ధర తగ్గిస్తూ చంద్రబాబు డ్రామాలు చేసినా అదే పెట్రోల్, డీజిల్‌ పోసి 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ పార్టీని ప్రజలు తగులబెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు వయసు పెరిగిందే తప్ప బుద్ధి పెరగలేదని, ఆయన జీవితమంతా అసత్యాలు, మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు అని విరుచుకుపడ్డారు. మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌పై బురద చల్లేందుకు ఏదోవిధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలపై చంద్రబాబు ధర్నాలు, నిరసనలు అంటున్నారన్నారు. బాబు ఇలాగే ఉంటే కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రజలే మళ్లీ బాబుపై పెట్రోల్, డీజిల్‌ పోసి తగులబెట్టడం ఖాయమన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top