సఫలం.. సంక్షేమం.. సామరస్యం.. మా 8 ఏళ్ల పాలన సారాంశమిదే! | Sakshi
Sakshi News home page

‘మాది సఫలం.. సంక్షేమం.. సామరస్యం.. మీది వైఫల్యం.. విషం.. విద్వేషం’

Published Wed, Sep 14 2022 1:22 AM

Minister Harish Rao Criticized Central Government Eight Year Rule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘విదేశాల నుంచి నల్లధనం తేవడంలో ఫెయిల్‌.. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేయడంలో ఫెయిల్‌.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలివ్వడంలో ఫెయిల్‌.. పెద్ద నోట్ల రద్దు ఫెయిల్‌.. రైతు ఆదాయం రెట్టింపు చేయడంలో ఫెయిల్‌.. చిన్న పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) రుణాలివ్వడంలో ఫెయిల్‌.. అర్హులకు ఇండ్లు కట్టించడంలో ఫెయిల్‌.. మేకిన్‌ ఇండియా ఫెయిల్‌.. పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లు ఫెయిల్‌.. గంగానది ప్రక్షాళన ఫెయిల్‌.. నదుల అనుసంధానం ఫెయిల్‌.. బుల్లెట్‌ రైలు ఫెయిల్‌.. హర్‌ఘర్‌కో జల్‌ ఫెయిల్‌.. ఫెయిల్‌.. ఫెయిల్‌... ఫెయిల్‌. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలన సారాంశం అన్నింటా వైఫల్యం, విషం, విద్వేషం. కానీ తెలంగాణలో మా ఎనిమిదేళ్ల పాలనా సారాంశం మాత్రం.. సఫలం, సంక్షేమం, సామరస్యం..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. పచ్చని పంటలు పండాలనేది టీఆర్‌ఎస్‌ సిద్ధాంతమైతే, మతం పిచ్చి మంటలు రగిలించాలనేది బీజేపీ సిద్ధాంతమని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలు పారించాలనేది టీఆర్‌ఎస్‌ అభిమతమైతే, తలలు పగిలి రక్తాలు పారించాలనేది బీజేపీ అభిమతమని దుయ్యబట్టారు. మంగళవారం శాసనసభలో ‘ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరి–రాష్ట్ర ప్రగతిపై ప్రభావం’ అనే అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. 

బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు బీజేపీ ఉద్దేశం 
‘బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు ఉండాలనేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులను సమీక్షించేందుకు ఉన్నతస్థాయిలో అంతర ప్రభుత్వ కమిటీ వేయాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే అలాంటి కమిటీని ఏర్పాటు చేయకుండానే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణలు తెచ్చే ప్రయత్నం కేంద్రం చేసింది. తాను తీసుకునే అప్పులను రికవరీలో పెట్టకుండా రాష్ట్రాలు తీసుకునే అప్పులను మాత్రం రికవరీలో పెట్టి పరిమితులు విధించడం, వాటిని గతంలో తీసుకున్న అప్పులకు కూడా వర్తింపజేయడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం. నీతి ఏదైనా కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి. అలా కాకుండా కోతల విషయంలో రాష్ట్రాలకు, తీసుకునే విషయంలో కేంద్రానికి నిబంధనలు వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం పొందిన తర్వాత ఎఫ్‌ఆర్‌బీఎం పేరుతో కోతలు పెట్టారు. అలాంటప్పుడు బడ్జెట్‌ అంచనాలే తలకిందులవుతాయి. రాష్ట్రాలతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదు..’ అని హరీశ్‌ పేర్కొన్నారు.  

ప్రతిపైసా మూలధన వ్యయం కిందే ఖర్చు చేస్తున్నాం 
‘గతంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫారసులను తు.చ. తప్పకుండా అమలు చేశాయి. కానీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రతో, కక్షతో తెలంగాణకు రావాల్సిన నిధులను నిలిపివేసింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32–42 శాతానికి పెంచినప్పుడు నిజమేనని నమ్మాం. కానీ వాస్తవంగా ఇస్తోంది 29.6 శాతమే. ఒకవేళ 42 శాతం చొప్పున ఇస్తే రూ.33,712 కోట్లు అదనంగా రావాల్సి ఉంది. పన్నుల్లో వాటా అయితే రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో కేంద్రం సెస్సుల రూపంలో వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2017–18లో రూ.81,282 కోట్లు, 2018–19లో రూ.1.58 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం కోసం బడ్జెట్‌ వెలుపలి  అప్పులు చేసింది. దాన్ని కాగ్‌ కూడా తప్పు పట్టింది. తెలంగాణ మాత్రం ప్రతి పైసా మూలధన వ్యయం కిందే ఖర్చు చేస్తోంది.  

గ్యాస్‌ సిలిండర్లపై ఫొటోలు పెట్టుకోండి 
ఎఫ్‌ఆర్‌బీఎంని మించి రూ.6 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కేంద్రానికే దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.1,52,17,910 కోట్లు. దేశ జనాభాతో లెక్కిస్తే తలసరి అప్పు రూ.1,25,679 ఉంది. అదే రాష్ట్రం చేసిన రూ.3,29,980 కోట్లకు రాష్ట్ర జనాభాను లెక్కగడితే రూ.94,272 మాత్రమే. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ రూ.1,200 అయ్యింది. ప్రతి ఇంటికీ వెళ్లే గ్యాస్‌ సిలిండర్లపై మీ ఫోటోలు పెట్టుకోండి..’ అని హరీశ్‌ ఎద్దేవా చేశారు.  

ఆర్థిక అంశాల్లో తెలంగాణ చాంపియన్‌ 
‘ఆర్థిక అంశాల్లో తెలంగాణ చాంపియన్‌గా నిలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అప్పులతో పాటు రాష్ట్రంలో ఆదాయమూ పెరిగింది. 2015–16 నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో సొంత పన్నుల రాబడిలో తెలంగాణ సగటున 11.5 శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే నంబర్‌ 1గా నిలిచింది. 2014లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం అయితే, ఇప్పుడు 4.9 శాతం. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమయినా అప్పులు తీసుకోవాల్సిందే. తెలంగాణ స్థూల ఉత్పత్తిలో అప్పు కేవలం 23.5 శాతం మాత్రమే. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు చెల్లిస్తే, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ.1,96,448 కోట్లే. తెలంగాణనే కేంద్రానికి రూ.1,69,349 కోట్లు ఇచ్చింది. కేంద్రంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలను తెలంగాణ సాదుతోంది. మేము సంపదను పెంచి పేదలకు పంచాం. కేంద్రం మాత్రం గద్దలకు పంచుతోంది. కార్పొరేట్‌ కంపెనీలకు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోంది.  

నిధులిచ్చి ఉంటే రూ.లక్ష కోట్ల అప్పులు తగ్గేవి 
తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం ఇచ్చి ఉంటే రాష్ట్రం అప్పులు రూ.లక్ష కోట్లు తగ్గేవి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి తగ్గింపు వల్ల రూ.17,033 కోట్లు, విద్యుత్‌ సంస్కరణల పేరిట 5 శాతం కింద రూ.6,104 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.6,268 కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద రూ.817 కోట్లు, పన్నుల్లో 42 శాతం వాటా కింద రూ.33,712 కోట్లు, ఏపీ నుంచి విద్యుత్‌ బకాయిల కింద రూ.17,828 కోట్లు, 2014–15లో పొరపాటున ఏపీకి జమచేసిన రూ.495 కోట్లు, ప్రత్యేక సహాయ గ్రాంట్ల కింద రూ.1,350 కోట్లు, నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకు మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు, కాకతీయకు రూ.5వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది..’ అని మంత్రి తెలిపారు. బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి ఆ నిధులిప్పించాలని కోరారు. అలా చేస్తే దండేసి దండం పెడతామని, సభలోనే కృతజ్ఞతలు చెపుతామని అన్నారు.

ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో​ అదరగొట్టిన కేటీఆర్‌.. అసెంబ్లీలో చప్పట్ల మోత! 

Advertisement
 
Advertisement
 
Advertisement