సాక్షి, కరీంనగర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాల వెలువడుతున్నాయి. ఐదింట మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం అందుకోనుంది. తమిళనాడులో ఫలితాలు హంగ్ దిశగా, కేరళలో యూడీఎఫ్ విజయం దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించిన పార్టీలకు గుణపాఠం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అసోంలో బీజేపీ గెలుస్తోంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదు. రాహుల్ గాంధీని రాజకీయ నాయకులుగా ఆ పార్టీ నాయకులే గుర్తించడం లేదు. దేశ ప్రజలంతా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలవాలని కోరుకున్నారు. కేరళ, తమిళనాడులో ఆశించిన ఫలితాలే వస్తున్నాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్‌తో పాటు, అనేక పార్టీలకు గుణపాఠం అని ఘాటు విమర్శలు చేశారు.
మరోవైపు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘అసోంలో వచ్చిన తీర్పు బీజేపీ పాలనకు సజీవ సాక్ష్యం. బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వడానికి మోదీ రాబోతున్నారు. హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లలో తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుంది. సౌత్‌లో భవిష్యత్‌లో ఎగిరేది బీజేపీ జెండానే. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారు’ అని వ్యాఖ్యలు చేశారు.


