సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం

Minister Avanthi Srinivas Fires On Sabbam Hari Abusive Comments - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బం హరిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో ఆయన వీధి రౌడీలా మాట్లాడారని మండిపడ్డారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సిబ్బందిపై సబ్బం హరి దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం సరికాదని మంత్రి అవంతి హితవు పలికారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘మీరు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా? పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు’అని మంత్రి పేర్కొన్నారు.
(చదవండి: ‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’)

సబ్బం హరి తీరుపై ఎమ్మెల్యే అదీప్‌రాజు విమర్శలు గుప్పించారు. ఆయన  నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని అన్నారు. సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాకు తెలిపారు. రికార్డులు తారుమారు చేసి సబ్బం హరి పార్క్‌ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. గతంలో ఆయన ఆక్రమణలపై టీడీపీ-వామపక్షాలు ధర్నాలు చేశాయని గుర్తు చేశారు. అధికారులు నోటీసులు ఇచ్చినా సబ్బం హరి పట్టించుకోలేదని కరణం ధర్మశ్రీ వెల్లడించారు. గతంలో ఆయన భూకబ్జాపై అయ్యన్నపాత్రుడు పోరాటం కూడా చేశారని, జిల్లా పరిషత్ సమావేశంలో సబ్బం హరి భూకబ్జాను అయ్యన్న నిలదీశారని తెలిపారు. ఇప్పుడు సబ్బం హరికి మద్దతుగా అయ్యన్న మాట్లాడటం సిగ్గుచేటని కరణం ధర్మశ్రీ విమర్శించారు.
(చదవండి: కబ్జా స్థలంలో టాయిలెట్ నిర్మించిన సబ్బం హరి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top