భట్టి ప్రతి అడుగూ కాంగ్రెస్‌ విజయానికి దోహదం | Mani Rao Thackeray at the launch of Peoples March Diary | Sakshi
Sakshi News home page

భట్టి ప్రతి అడుగూ కాంగ్రెస్‌ విజయానికి దోహదం

Sep 10 2023 1:45 AM | Updated on Sep 10 2023 1:49 AM

Mani Rao Thackeray at the launch of Peoples March Diary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీపుల్స్‌మార్చ్‌ పేరుతో ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలోని ప్రతి అడుగు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి దోహదపడుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకే భట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారని అభినందించారు. ప్రజల సమస్యలను విని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేదలకు చేయబోయే మేలుపై భరోసా కల్పించగలిగారని పేర్కొన్నారు.

సీనియర్‌ జర్నలిస్టు, ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ రచించిన ‘పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర’డైరీని శనివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఠాక్రే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండుటెండలను కూడా లెక్క చేయకుండా 110 రోజుల పాటు భట్టి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని చెప్పారు. ఇంతటి సాహసోపేతమైన పాదయాత్రను తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇంతకుముందు చేయలేదన్నారు.   

ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కోసమే: భట్టి 
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా తన యాత్రను కొనసాగించానని చెప్పారు. ఏఐసీసీ ఆదేశాలతో చేపట్టిన ఈ యాత్రను ఠాక్రే, రోహిత్‌చౌదరి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, శ్రీధర్‌బాబు తదితరులు ఆన్నీ తామై నడిపించారని, నడిచింది తానే అయినా పాదయాత్ర విజయవంతం వెనుక ఆ నాయకులతో పాటు లక్షలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తల శ్రమ ఉందన్నారు. తన యాత్రకు పీపుల్స్‌మార్చ్‌ అనే పేరు పెట్టింది ప్రజాయుద్ధనౌక గద్దర్‌ అని, యాత్రలో పాల్గొని ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ గద్దర్‌ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, పార్టీ విజయం కోసం తపనతో పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని, గౌరవించుకుంటామని భరోసా ఇచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రసంగించిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, కాంగ్రెస్‌ పార్టీ నేతలు చిన్నారెడ్డి, బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య, చల్లా నర్సింహారెడ్డి, రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర డైరీని రచించిన సీనియర్‌ జర్నలిస్టు సురేందర్‌ను పలువురు అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement