పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు
2 లక్షల కేంద్ర సిబ్బందిని దింపారన్న మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
ఉత్తర 24 పరగణాలలో తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడిన బెనర్జీ.. శాంతిభద్రతలు కాపాడటానికి వచ్చిన సీఆర్‌పీఎఫ్ సాయుధ వాహనాల వినియోగం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలు, రైల్వే వంటి సంస్థలు కూడా పోలింగ్ విధుల్లో నిమగ్నమయ్యాయని అన్నారు.
“ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ, ఇది ప్రజలకు హాని చేసే సమయం కాదు” అని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరైనా పోలింగ్ వేళ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని తర అనుచరులను కోరారు. సుమారు 2 లక్షల కేంద్ర సిబ్బందిని రాష్ట్రానికి తీసుకువచ్చారని చెప్పారు. “ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించడం ద్వారా నన్ను భయపెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.
బీజేపీకి మమత సవాల్ విసురుతూ.. “సాయుధ వాహనాలకు శక్తి ఎక్కువా లేక ప్రజలకు శక్తి ఎక్కువా చూడాలి. నేను దేనికీ భయపడను. ఇలాంటి సాయుధ వాహనాలను మణిపూర్‌లో వినియోగించాలి. మణిపూర్‌లో మూడు సంవత్సరాలుగా అశాంతి కొనసాగుతోంది. బెంగాల్‌లో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు” అని తెలిపారు.
జాతీయ భద్రత అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. “పహల్గామ్‌లో ఉగ్రవాదులు భారతీయులను హతమార్చినా, కేంద్ర సర్కారు పాకిస్థాన్‌పై చర్య తీసుకోలేకపోతోంది. కానీ బెంగాల్ ఎన్నికల కోసం మాత్రం అన్ని బలగాలను తీసుకువస్తున్నారు” అని అన్నారు. కాగా, గురువారం (ఏప్రిల్ 22) పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.


