
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని గత కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ప్రశాంత వాతావరణంలో గనుక పోలింగ్ జరిగితే ఓటమి ఖాయమని భావిస్తున్న అధికార టీడీపీ.. ఎప్పటికప్పుడు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీస్తోంది. తాజాగా..
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక భాగం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. ఇందులో అధికంగా ఓట్లు ఉన్న నల్లపురెడ్డిపల్లి, ఎర్రిబల్లి, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్‌లనే జబ్లింగ్ చేయడం గమనార్హం. ఎర్రిబల్లి ఓటర్లకు నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ బూత్, నల్లపురెడ్డిపల్లి ఓటర్లకు ఎర్రిబల్లిలో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల ఓట్లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. అయితే..
ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా చేసేందుకే టీడీపీ నేతలు ఈ కుట్ర పన్నారంటున్న వైఎస్సార్సీపీ అంటోంది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా నామినేషన్ల సందర్భంగా ఇచ్చిన పోలింగ్ బూత్‌ల లిస్టును మళ్లీ ఎలా మారుస్తారని ప్రశ్నిస్తోంది.
బూత్‌లు మార్చేప్పుడు రాజకీయ పార్టీలతో సంప్రదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కి ఉంటుందని.. కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా బూత్‌లను మార్చారంటూ మండిపడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పోలింగ్ బూత్‌లను జంబ్లింగ్ చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు.