
టీడీపీ రాబంధుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళే హోం మంత్రిగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో, పైగా ఆమె నియోజకవర్గంలో మహిళలపై దాష్టీకాలు జరుగుతుంటే పట్టనట్లు ఉంటున్నారని అన్నారామె.
సాక్షి, తాడేపల్లి: రాబంధుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏంటి? ఇప్పుడు జరుగుతున్న దారుణాలు ఏంటి?. రాష్ట్రంలో రాబందులు స్వైర విహారం చేస్తున్నాయి. మహిళలకు రక్షణే లేకుండా పోయింది. టీడీపీ ఎమ్మెల్యేలే అరాచకవాదులుగా మారిపోయారు. మహిళా ఉద్యోగుల పాలిట టీడీపీ ఎమ్మెల్యేలు రాక్షసులుగా మారారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?..
అధికారుల మీద అధికారం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరు ఇచ్చారు?. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య మీద ఎమ్మెల్యే రవికుమార్ దాష్టీకానికి దిగారు. రాత్రి సమయాల్లో కూడా తన ఆఫీసులో ఉంచటం ఏంటి?. అర్ధరాత్రి వీడియో కాల్స్ చేయడం ఏంటి?. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అరాచకాలు తట్టుకోలేక సూఫియా అనే మహిళ ఆత్మ హత్యాయత్నం చేశారు. కూటమి నేతలు రాబందులుగా మారారు. పోలీసులకు మొరపెట్టుకున్నా.. వాళ్లు పట్టించుకోవటం లేదు. జరుగుతున్న దారుణాలు ఎల్లో మీడియాకు ఎందుకు కనపడటం లేదు?. ప్రశ్నించే సాక్షి మీద అక్రమ కేసులు, గొంతు నులుమే చర్యలు చేస్తారా?.
సౌమ్య ఆత్మ హత్యాయత్నంపై హోంమంత్రి అనిత ఎందుకు మాట్లాడటం లేదు?. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదు. కూటమి ప్రభుత్వం బాధితుల తరపున ఏనాడూ నిలపడలేదు. పైగా అన్యాయం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు. మహిళల వ్యక్తిత్వ హననానికి కూటమి నేతలే ఆజ్యులు. చిన్నారులపై కూటమి కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడం లేదు.

జగన్ హయాంలో దిశా యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ వలన ఏం ప్రయోజనం చేకూరింది?. వైఎస్సార్‌సీపీ నేతలు పోరాటం చేస్తే తప్ప బాధితులకు న్యాయం చేయరా?. రాష్ట్రంలో మహిళలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుంది
దళిత మహిళల మీద జరిగే దారుణాలను అసలే పట్టించుకోవటం లేదు. మహిళలే కాదు, ఐపిఎస్ అధికారులు సైతం కూటమి ప్రభుత్వ వైఖరికి ఇబ్బంది పడుతున్నారు. దళితులను గంజాయి తాగేవారంటూ అవమానించారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత నియోజకవర్గంలోనే మహిళలపై దాష్టీకాలు జరిగితే పట్టించుకోవడం లేదు’’ అని శ్యామల మండిపడ్డారు.