
ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి ఈసీ కొమ్ము కాస్తోందని, అందుకు ఆధారాలూ ఉన్నాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మీడియా ముందుకు రావడం తెలిసిందే. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక కోసం ఎన్నికల అధికారులు ఉన్నపళంగా పోలింగ్ బూత్‌లను మార్చేయడం(జంబ్లింగ్) విమర్శలకు దారి తీసింది. ఇంతకీ ఇలా ఇష్టానుసారం మార్చేయొచ్చా?..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుపెన్నడూ లేని సంస్కృతికి అధికారులు తెర లేపారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిల్లో దాదాపు ఆరు(6, 7, 8 ,9 ,10 ,11) పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేశారు. అదీ రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండానే. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో అవాక్కు కావడం అందరి వంతు అయ్యింది. ఈ నిర్ణయంతో.. ఇంటి ప్రక్కనే పోలింగ్ కేంద్రం ఉన్న ఆ ఓటర్ మాత్రం తన ఓటును నాలుగు కిలోమీటర్ల వెళ్లి వేసుకోవాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. అదే సమయంలో రాజకీయ దుమారమూ చెలరేగింది.
రాజ్యాంగం ఏం చెబుతోందంటే..
రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండా ఇలా పోలింగ్ బూత్‌లను మార్చేయడం తీవ్రమైన చర్యనే. తద్వారా పారదర్శకత, నిష్పాక్షికత రెండూ దెబ్బతింటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం..
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ (ఓటర్ల జాబితాల తయారీ సహా) అప్పగించబడ్డాయి. ఇందులో ఓటర్ల జాబితాల తయారీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌లను ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చొచ్చు. ఈ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు ముందుగా సమాచారం ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదు. కానీ అదే సమయంలో.. ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా, ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్న అంశం మాత్రం నొక్కి చెబుతోంది. పులివెందుల పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల పారదర్శకత, నిష్పాక్షికత ఈ రెండింటినీ దెబ్బ తీసే అంశాలేనన్న చర్చ నడుస్తోంది.
వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 10,601 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో 4,000 ఓట్లు ఉన్న ఆరు పోలింగ్ కేంద్రాలను ఆ ప్రాంతాలలో కాకుండా మరో ప్రాంతానికి మార్చడమే అసలు సమస్యగా మారింది. మొత్తం ఓట్లలో 65 శాతం ఓట్లున్న కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లోనే తమ పార్టీకి పట్టుందని, ఉద్దేశపూర్వకంగానే పోలింగ్ బూత్‌ల మార్పు జరిగిందని, అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి అధికారులు పోలింగ్ కేంద్రాలను మార్చారని వైఎస్సార్‌సీపీ అంటోంది.

స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ టీడీపీ ఎత్తుగడగా కనిపిస్తోందని చెబుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకుండా చేయడం వల్ల పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని సైక్లింగ్ లేదంటే రిగ్గింగ్ చేసుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
కోర్టులు ఏం చెబుతున్నాయంటే..
1951 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఎన్నికల సంఘానికి పోలింగ్ ఏర్పాట్లు నిర్వహించేందుకు, బూత్‌ల స్థానాలను నిర్ణయించేందుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. అయితే 2018లో కమల్ నాథ్ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో పార్టీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈసీ ఈ తరహా చర్యలు తీసుకోవడం నిషేధించాలంటూ దిశానిర్దేశాలు కోరారు. ఈ క్రమంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు పట్ల రాజకీయ పార్టీల ఆందోళనలను సుప్రీం కోర్టు నిశితంగా పరిశీలించడం గమనార్హం. అంతేకాదు కోర్టులు గతంలో ఎన్నికల సంబంధిత నిర్ణయాల్లో పారదర్శకత, ప్రక్రియాత్మక న్యాయత అవసరాన్ని స్పష్టంగా హైలైట్ చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
ఎన్నికల సంఘానికి పరిపాలనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. పోలింగ్ బూత్ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకపోవడం, సహజ న్యాయం, ఎన్నికల న్యాయత సూత్రాలకు విరుద్ధమే. ఈ అభ్యంతరాలతో పార్టీలు న్యాయస్థానాలనూ ఆశ్రయించవచ్చు.