
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కళాశాలను వైఎస్సార్‌సీపీ నేతలు ఇవాళ (సోమవారం) సందర్శించారు. మెడికల్ కళాశాల భవనాలను, ఆసుపత్రి భవనాలను, నర్సింగ్ కాలేజీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 90 శాతం మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రూ.532 కోట్ల ప్రాజెక్టుతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో కేవలం దాదాపు రూ.120 కోట్ల రూపాయలు పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని.. ఆ పనులు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.
టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలను సందర్శించి ఫేస్ 3,4 నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఫోటోలు దిగి మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని ఆవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటు అని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్వయంగా పరిశీలించి 50 సీట్లకు పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చిందని.. అధికారంలో ఉన్న చేతకాని ప్రభుత్వం మెడికల్ సీట్లను వెనక్కి పంపిందన్నారు.
కేవలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి నీచ పనులు చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ భాష, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.