రికార్డు స్థాయిలో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు
సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువగా నమోదు
ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులు..
హిమాలయ ప్రాంతాల్లో మంచుతుపాన్లు కారణం
భవిష్యత్తులో మరింత తీవ్రత తప్పదంటున్న నిపుణులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాదిన మొదలైన చలి తీవ్రత.. రాష్ట్రాన్ని గజగజా వణికిస్తోంది. పది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. జనవరి రెండో వారం వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది.
అధిక పీడన ప్రభావంతో ఉత్తర భారతం నుంచి బలమైన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా పడిపోయినప్పుడు దానిని ‘అతి శీతల గాలులు’ (కోల్డ్‌వేవ్)గా ప్రకటిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి.
ఇన్వర్షన్ లేయర్‌తో ప్రమాదం..!
సాధారణంగా భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ.. ఉపరితలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉండటంతో ఉష్ణోగ్రతలు పైకి వెళ్లే కొద్దీ పెరుగుతున్నాయి. దీన్నే ఇన్వర్షన్ లేయర్ అని పిలుస్తుంటారు. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ మాదిరిగా.. కింది నుంచి వెళ్లే నీటి ఆవిరి, కాలుష్యం, దుమ్ము ధూళి కణాలన్నీ కలిసి ఇన్వర్షన్ లేయర్ కారణంగా మధ్యలోనే ఆగిపోయి పొగమంచులా ఏర్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని వాతావరణ నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
పొగమంచు మరో సమస్య
పొగమంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా పగటి వేళల్లో ఉదయం 9 గంటల వరకూ లైట్లు వేసుకొని ప్రయాణం చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎందుకు చలి పెరుగుతోంది.?
భూతాపం పెరగడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులు కూడా కారణమని చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడిన మంచు తుపాన్లు, వాయు పీడన మార్పులు దక్షిణ భారతదేశం వైపు చల్లని గాలులను వస్తున్నాయి. అదే సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండటం, మేఘావరణం లేకపోవడం వల్ల రాత్రివేళ భూమి నుంచి వేడి త్వరగా బయటకు వెళ్లిపోతోంది. దీని ఫలితంగా చలి మరింత పెరుగుతోంది.
సైబీరియా గాలులూ ఓ కారణమే..!
అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు వేగంగా, భారీగా చల్లని గాలులు కదలడాన్ని ‘కోల్డ్ సర్జ్’ అని పిలుస్తారు. ప్రస్తుత పరిస్థితులకు ఇది కూడా ఒక కారణంగా మారింది. ముఖ్యంగా.. సైబీరియా, మంగోలియా ప్రాంతాల నుంచి ఇటువైపు గాలులు వస్తున్నాయి. ఇవి గంటకు 25 నుంచి 60 కిమీ వేగంతో వస్తున్నాయి. ఇవి ప్రవేశించే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోతాయి. దీనివల్లే చల్లని గాలులకు పొగమంచు తోడవుతోంది. జనవరి వరకూ ఈ పరిస్థితులు కొనసాగనున్నాయి. ఈ తరహా చలి తీవ్రత అనారోగ్యాలకు కారణమవుతుంది. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేవారు గాలిని తట్టుకునే దుస్తులు ధరించాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. – ప్రొ.భానుకుమార్, వాతావరణ నిపుణుడు


