రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్‌

KTR Fires On BJP Behaviour About Dubbaka Bye Election In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి నేడు(ఆదివారం) ఆఖరిరోజు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడానికి గత 22 రోజులుగా బీజేపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

'దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. గత 22 రోజులుగా ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నిన బీజేపీ చివరికి డబ్బు పంచడానికి కూడా సిద్ధమైంది. ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ  వద్ద  పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. తాజగా నేడు దుబ్బాక వెళ్తున్న కోటి రూపాయల నగదును హైదరాబాద్‌లో పట్టుబడ్డాయి. ఈ డబ్బులు ఎవరివి అనేవి పోలీసులు ఇప్పటికే నిర్థారించారు. అంతేకాదు బీజేపీ అభ్యర్థి చేయి విరిగిందని అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. తిమ్మిని బమ్మి చేయడం బీజేపీకి బాగా అలవాటు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఇంట్లోనే డబ్బులు దొరికాయన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై గోబెల్స్ ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నారు. (చదవండి : బండి సంజయ్‌ అరెస్ట్‌.. పెట్రోల్‌ పోసుకున్న కార్యకర్త)

నేడు బీజేపీ కార్యలయం ముందు ఎవరో వ్యక్తి ఆత్మహత్యహత్నం చేసుకున్నాడని ప్రచారం మొదలుపెట్టారు. ఇలా ఉప ఎన్నిక ముగిసేవరకు ప్రగతి భవన్,తెలంగాణ భవన్,డీజీపీ కార్యాలయం లాంటివి ఎంచుకొని ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నారని మాకు విశ్వసనీయ సమాచారం. శాంతి భద్రతల విఘాతం కలిగేలా రక్తపాతం,లాఠీచార్జ్‌, ఫైరింగ్‌కు బీజేపీ ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని నిర్ణయించాం. ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖను కూడా రాశాము.. అలాగే ఇక్కడ సీఈఓని కూడా కలవనున్నాం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్‌ 10న వెలువడనుంది. (చదవండి : హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top