ఏది విధ్వంసం? ఏది ద్రోహం? | KSR Comments Over Payyavula Keshav And Buggana rajendranath | Sakshi
Sakshi News home page

ఏది విధ్వంసం? ఏది ద్రోహం?

Jul 14 2025 9:33 AM | Updated on Jul 14 2025 1:47 PM

KSR Comments Over Payyavula Keshav And Buggana rajendranath

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అధికార తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు సంధించిన ప్రశ్నలు అర్థవంతంగా ఉన్నాయి. గత ముఖ్యమంత్రి జగన్‌ పేషీలో పనిచేసిన అధికారులు పలువురిపై రాజకీయ ముద్ర వేసి పోస్టింగ్‌లు కూడా ఇవ్వని టీడీపీ ప్రభుత్వం అప్పటి ప్రముఖ కాంట్రాక్టర్లను మాత్రం ఎలా పక్కన బెట్టుకు తిరుగుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూటమి పెద్దలు జవాబు ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రముఖ కాంట్రాక్టర్‌ మేఘా సంస్థ అధినేత పి.కృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తన హెలికాప్టర్‌లో తన స్వగ్రామానికి తీసుకెళ్లారని వార్తలొచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండగా పోలవరం కాంట్రాక్టు‍ను నవయుగ సంస్థ నుంచి తప్పించి మేఘాకు ఇచ్చినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. అంతెత్తున విమర్శలు చేసిన వ్యక్తి అధికారం రాగానే ఎలా దగ్గరైపోయాడన్నది బుగ్గన ప్రశ్న!. అందుకే ఆయన దీన్ని ఏ రాజకీయం అంటారో కేశవ్ చెబుతారా? అని ప్రశ్నించారు.

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పనిచేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, ఇతర ప్రభుత్వ అధికారులు ఏం తప్పు చేశారని ఇప్పుడు వేధిస్తున్నారని నిలదీశారు బుగ్గన. కాంట్రాక్టర్లు.. కొంతమంది పెట్టుబడిదారులతో మాత్రం ఎందుకు అలయ్ బలయ్ నడుపుతున్నారు? ఆర్థిక బంధమే బలమైందన్న విమర్శలకు వీరు ఆస్కారం ఇవ్వడం లేదా! అని మరో విషయాన్ని బుగ్గన  ప్రశ్నించారు. ప్రభుత్వ అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే దేశద్రోహం అవుతుందన్న కేశవ్  వ్యాఖ్యలను ప్రస్తావించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులను నిలదీశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కొందరు వైఎస్సార్‌సీపీ పాలనలో కులాలు, మతాల మధ్య తగాదాలు పెట్టేలా ప్రచారం చేసేవారని, అప్పుడు రాజద్రోహం కేసు పెడితే గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక అక్రమాలపై ప్రశ్నిస్తే  దేశద్రోహం అంటున్నారని విమర్శించారు.

గత టర్మ్‌లో ఆలయాల వద్ద రచ్చ చేయడం, అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ విషయంలో సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇవేవీ తప్పు కావని కూటమి నేతలు భావిస్తే భావిస్తుండవచ్చు. కానీ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారు చేసిన ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్ర  ప్రభుత్వం ఇప్పటికి రూ.1.70 లక్షల కోట్ల అప్పులు చేసిందని అంచనా. దారుణమైన  షరతులకైనా ఓకే  చెప్పేసి అందుకు అనుగుణంగా జీవోలు  ఇచ్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ట్రెజరీ ఖాతాను తాకట్టు పెట్టారు. అది ఎంతవరకు సమర్థనీయమని బుగ్గన, తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి కేశవ్‌లు ఎవరూ సమాధానం ఇవ్వలేదు. కేశవ్ దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయవద్దని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులో, కొందరు నేతలో పెట్టుబడిదారులకు ఈ-మెయిల్స్ పంపుతున్నారని, ఇది దేశద్రోహమని, వారిపై కేసులు పెట్టాలని అంటున్నారు.

కేశవ్ చాలాకాలం విపక్షంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయన్న సంగతి కూడా ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. ఫిర్యాదులు చేస్తే రుణాలు ఇవ్వడం ఆగిపోతుందా!. ఆయన చెప్పేదే అభ్యంతరకరమైతే, గత టర్మ్‌లో జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసి, అసత్యాలతో కేంద్రానికి, ఆయా వ్యవస్థలకు ఫిర్యాదు చేసిన వారిపై ముందుగా కేసులు పెట్టాలి కదా అన్న వైఎస్సార్‌సీపీ నేతల ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి.. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై పచ్చి అబద్దాలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ఫిర్యాదు చేసి వచ్చారు కదా?.

చంద్రబాబు, పవన్, లోకేశ్‌ తదితరులు ఏపీ అప్పు రూ.పది లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లంటూ తప్పుడు లెక్కలు ప్రచారం చేశారు కదా? ఆర్థిక విధ్వంసం అని ఊదరగొట్టారు కదా? అవన్నీ ఏపీ ప్రతిష్టను దెబ్బతీసేవి కాదా! ఏపీకి ఎక్కడ రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అందులో చంద్రబాబు 2014 టర్మ్‌లో చేసిన అప్పు ఎంతో ఎందుకు ఏనాడు చెప్పలేదు? బడ్జెట్లో కేవలం రూ.5.5 లక్షల కోట్ల అప్పేనని కేశవ్ ఎందుకు చదివారు? మళ్లీ బయటకు వచ్చి రూ.పది లక్షల కోట్లు అని ఎలా అంటున్నారు? ఇదంతా రాష్ట్రం బ్రాండ్‌ను చెడగొట్టడం కాదా?. ఈ పని చేసినందుకు ముందుగా కూటమి నేతలపై కదా కేసులు  పెట్టాల్సింది?. ఆ పని చేయకుండా వైఎస్సార్‌సీపీ వారిపై ఆరోపణలు చేస్తే సరిపోతుందా!.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, కరోనా సమయంలో జీతాలు ఆలస్యమైతే కూడా హైకోర్టుకు వెళ్లిందెవరు?. జగన్ ప్రభుత్వం దేనికైనా జీవో ఇచ్చిన మరుసటి రోజే ప్రజా ప్రయోజన వాజ్యం పేరుతో హైకోర్టులో ఎన్ని వందల దావాలు వేశారు?. అదంతా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం కాదా? తమ టైమ్‌లో చేసిన అప్పులను సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించామని, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూ.1.70 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. దీనిపై శ్వేతపత్రం ఇవ్వడానికి కేశవ్ సిద్దపడతారా? అన్నిటికి మించి ట్రెజరీని తాకట్టు పెట్టిన చరిత్ర గతంలో ఎన్నడైనా ఉందా అని ఆయన అడుగుతున్నారు.

ఏపీఎండీసీ ఏడు వేల కోట్ల అప్పు తీసుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇస్తే, దానిని ఆర్థిక విధ్వంసం అని ప్రచారం చేసిన టీడీపీ పెద్దలు, ఇప్పుడు ఏకంగా తొమ్మిది వేల కోట్ల అప్పును తీసుకున్నారో లేదో చెప్పాలి కదా! ఇందుకోసం రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టారే. అక్కడితో ఆగకుండా పెట్టుబడిదారులకు సకాలంలో వడ్డీ, వాయిదాలు చెల్లించకపోతే నేరుగా రిజర్వు బ్యాంక్ ఖాతా నుంచి తీసుకోవచ్చని జీవో ఇవ్వడం సరైనదేనా అన్న బుగ్గన ప్రశ్నకు కేశవ్ ఎందుకు జవాబు ఇవ్వలేదు.

పైగా ఖనిజాభివృద్ది సంస్థ నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రుణం తీసుకుంటే తాము తొమ్మిది వేల కోట్లు తీసుకున్నామని కేశవ్ గొప్పగా  సమర్ధించుకున్నారు. అంటే ఇది ఆర్థిక విధ్వంసం కాదా?. ఏపీలో అక్షరాస్యత పెంచడానికి, చదువులను ప్రోత్సహించడానికి జగన్ అమ్మ ఒడి తదితర స్కీములను పెడితే ఆర్థిక విధ్వంసం అని, శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఆ తర్వాత అదే స్కీమును  మరింత ఎక్కువ మందికి ఇస్తామని వాగ్దానం చేశారు. ఒక ఏడాది ఎగవేసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న  వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నారు. మరి ఇది ఆర్థిక విధ్వంసం అవుతుందా? కాదా? అన్నది కేశవ్ చెప్పాలి కదా!.

ఒకవైపు జగన్ స్కీములను కొనసాగిస్తూ.. మరో వైపు జగన్ టైమ్‌లో విధ్వంసం అంటూ  ప్రచారం చేయడం కూటమి నేతలకే చెల్లింది. సూపర్ సిక్స్‌ సహ పలు  హామీలు అమలు చేయమని అడగడం దేశద్రోహం అవుతుందా?. ఎన్నికల ప్రణాళికలో వందల కొద్ది హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయాలనుకోవడం ప్రజాద్రోహం అవుతుందా? కాదా? అన్నది కూటమి నేతలే తేల్చుకోవాలి.


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement