కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?

Kothakota Dayakar Reddy Quit TDP, Likely To Join Congress Party - Sakshi

టీడీపీని వీడుతున్నట్లు దయాకర్‌రెడ్డి ప్రకటన

ఏ పార్టీలో చేరేది 3 నెలల తర్వాతే నిర్ణయమని వెల్లడి

రేవంత్‌తో సత్సంబంధాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరే చాన్స్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలుగుదేశం సీనియర్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడుతున్నారు. దయాకర్‌రెడ్డి గురువారం ఈ విషయం వెల్లడించారు. వారిద్దరూ త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాల్లో వీరు కీలకంగా వ్యవహరించారు. 

దయాకర్‌రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్‌ నుంచి గెలుపొందారు. సీతమ్మ 2002లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో దంపతులిద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు.

ప్రజాభీష్టం మేరకే నిర్ణయం 
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంతకాలం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నా ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల కొంతకాలంగా మక్తల్, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరికి మూడు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందినట్లు తెలిసింది. (క్లిక్‌: అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా)

ఈ క్రమంలో దేవరకద్రలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీని వీడుతున్న విషయం వెల్లడిస్తూ దయాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు నెలల పాటు దేవరకద్ర, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటామని కొత్తకోట దంపతులు చెప్పారు. అయితే టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాల నేపథ్యంలో హస్తం గూటికి చేరే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. (క్లిక్‌: అన్ని పార్టీల్లోనూ అదే సీన్‌ అలక.. అసంతృప్తి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top