ఇది టీడీపీ, జనసేనకు జీర్ణించుకోలేని అంశమే

Kommineni Srinivasa Rao Comment On TDP And Jana Sena - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి పరోక్ష మితృత్వం నడుపుతున్న జనసేన పార్టీకి ఇది జీర్ణించుకోలేని విషయమే. ఎలాగొలా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలవాలని తహతహలో ఉన్న తెలుగుదేశం పార్టీకైతే మరింత అయోమయ పరిస్థితి అని చెప్పాలి. దానికి కారణం.. తెలుగుదేశంతో పొత్తు ఉండబోదని బీజేపీ నేతలు తేల్చి చెప్పడమే. ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జీ సునీల్ ధియోధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావులు దీనిపై కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. తదుపరి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అదే విషయం తెలిపారు.  

బీజేపీతో పొత్తు లేకపోతే తమకు భవిష్యత్తు లేదని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని జీవీఎల అన్నారు. ఎంత అవమానం. గత ఎన్నికలలో నలభై శాతం ఓట్లు సాధించుకున్న తెలుగుదేశం పార్టీ , ఒక్క శాతం ఓట్లు కూడా రాని బీజేపీపై ఆధారపడవలసి రావడం. బీజేపీతో స్నేహం కోరుకుంటున్నది వారి ద్వారా వచ్చే ఓట్లకన్నా, కేంద్రంలో బీజేపీకి ఉన్న అధికారం తమకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే  అన్న సంగతి తెలిసిందే.

గత ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని అనరాని మాటలు అని, సవాళ్లపై సవాళ్లు చేసిన చంద్రబాబు ఇప్పుడు నాలుక కరచుకుంటున్నారు. ఎన్నికలలో ఓటమి తర్వాత పూర్తిగా జారీ పోయి మోదీ ఒక్క నిమిషం దర్శనం ఇచ్చి పలకరిస్తేనే పులకరించే దుస్తితికి తెలుగుదేశం పడిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే టీడీపీని బీజేపీ నేతలు మరీ చులకన చేసి మాట్లాడుతున్నారు. అయినా పెద్దగా ఫీల్ కాకపోవడం టీడీపీ ప్రత్యేకత. అదే సమయంలో తమపై కేసులు రాకుండా బీజేపీని చంద్రబాబు విజయవంతంగా మేనేజ్ చేయగలిగారు.

అదే ఊపుతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని ఆయన తలపోశారు. అది జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వడానికి ఆయన యత్నిస్తున్నారు.  పొత్తుల విషయంలో మీడియాలో గందరగోళం ఉందేమోకాని, తమకు స్పష్టత ఉందని, సొంతంగా ఎదిగేలా ముందుకు వెళతామని, జనసేనతోనే పొత్తు ఉందని జివిఎల్ స్పష్టం చేశారు. నిజమే టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా ఈ విషయంలో పడరాని పాట్లు పడుతోంది. ఎలాగొలా టీడీపీ, జనసేన, బీజేపీలను ఒక గాటికి తెచ్చి జత చేయాలన్న వారి వ్యూహాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నాయి. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అయితే టీడీపీతో పొత్తుకు సిద్దమవుతున్నట్లు ఒకసారి, లేదన్నట్లుగా మరోసారి మాట్లాడుతూ ఆ పార్టీల కార్యకర్తలను అయోమయంలో పడవేస్తున్నారు.

తెలుగుదేశం అదినేత ఒకసారి జనసేనతో ఒన్ సైడ్ లవ్ అని , మరోసారి ఎన్.డి.ఎ. కూటమిలో చేరుతున్నట్లు లీక్ లు ఇవ్వడం వంటివి ఆ పార్టీ పరువు తీశాయి. తాజాగా ఆయన సమయాన్ని బట్టి , అవసరాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పడం విశేషం. అంటే  బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఎవరితోనైనా పొత్తు ఉంటుందని ఆయన చెబుతున్నారా అన్న విశ్లేషణలు వచ్చాయి. అసలు టీడీపీ ఒంటరిగా పోటీచేసి గెలవలేదన్న సంకేతాన్ని ఆయన పార్టీ శ్రేణులకు పంపించేశారు. ఆయన వ్యూహాలు ప్రస్తుతానికి బెడిసి కొట్టడంతో పార్టీలో  గందరగోళానికి ఆస్కారం ఇచ్చింది.  బీజేపీ గత మూడేళ్లలో టీడీపీ విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచలేదు.

కాకపోతే టీడీపీ రాజ్యసభ సభ్యులు  నలుగురిని బీజేపీలో విలీనం చేసుకుంది. తెలుగుదేశం పార్టీని కూడా విలీనం చేస్తే లోకేష్ రాజకీయ భవితవ్యంపై తాము భరోసా ఇస్తామని బీజేపీ నేతలు అన్నారని ప్రచారం జరిగింది. కాని పార్టీ విలీనానికి టీడీపీ అదినాయకత్వం సిద్దపడలేదు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించాలని బీజేపీ ప్రయత్నించినా, వారికి ప్రజాబలం లేకపోవడంతో ఆ ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. మాజీ ఎమ్మెల్యేలు కొందరు మాత్రం బీజేపీలో చేరారు. ఇందుకోసం బీజేపీలోకి వెళ్లిన టీడీపీ ఎమ్.పిలను వాడుకోవడానికి కృషి చేశారు.కాని అవి కూడా పెద్దగా పలితాలు ఇవ్వలేదు. అందుకే ప్రదాని మోడీ ఆద్వర్యంలో జరిగిన అజాది అమృతోత్సవ్ కు చంద్రబాబు హాజరై ఆయనతో కొద్ది నిమిషాలు ముచ్చటించారు. 

అది మర్యాదపూర్వక సంభాషణే అయినా, టీడీపీ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. దానివల్ల టీడీపీ బలహీనత మరింత బయటపడింది. ఈ తరుణంలో జూనియర్ ఎన్.టి.ఆర్. ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలవడం టీడీపీలో పెద్ద చర్చ అయింది. భవిష్యత్తులో ఎన్.టి.ఆర్.టీడీపీని స్వాధీనం చేసుకుంటారేమోనన్నంతగా చర్చలు సాగాయి. ఆయన ఏమి చేస్తారో తెలియదు కాని టీడీపీ లో మాత్రం అలజడి లేపారు. దీనిని కౌంటర్ చేయడానికి గాను టీడీపీ అనండి, ఆ పార్టీ సోషల్ మీడియా అనండి ఒక ప్రచారం పెట్టాయి. బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైపోయిందని, లోకేష్ హోం మంత్రి అమిత్ షాతో కలిశారని ప్రచారం చేశాయి.

తీరా చూస్తే అసలు వాస్తవం అలాంటి మీటింగ్ ఏది జరగలేదు. కేవలం జూనియర్ ఎన్.టి.ఆర్.కు పోటీగా ఇలాంటి వదంతులు సృష్టించారన్న సంగతి అర్ధం అయింది. దానిని బలపరుస్తూ, ఇప్పుడు జీవిఎల్‌, సునీల్ ధియోధర్లు వ్యాఖ్యానించారు. కుటుంబ వారసత్వం, అవినీతి పార్టీలతో బీజేపీ కలిసే ప్రసక్తి లేదని వారు పేర్కొన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ 2014, 2019 ఎన్నికలలో ఒంటరిగానే పోటీచేసింది. 2014లో బీజేపీ, జనసేనలతో కలిసి టీడీపీ పోటీచేసి అదికారంలోకి వచ్చింది.

2019నాటికి  ఈ మూడు పార్టీలు వేరు పడ్డాయి. ఎవరి దారి అవి చూసుకున్నాయి.  బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే, జనసేన వేరే కూటమి ఏర్పాటు చేసుకుంది. టీడీపీ మొదటిసారిగా ఒంటరిగా పోటీచేసి పరాజయం పాలైంది. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో స్నేహం కోసం అర్రులు చాస్తోంది. అయినా బీజేపీ వారిని కనికరించడం లేదు. ఈ నేపద్యంలో పొత్తులపై తానేమైనా చెప్పానా? ఎవరో రాస్తే, తాను బాధ్యుడనా అని వ్యాఖ్యానించి టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా పరువు తీయడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు.  ఆ సందర్భంలోనే సమయానుకూల పొత్తులని వ్యాఖ్యానించి , తన పార్టీ ద్వారాలన్నీ తెరచే ఉన్నవి అని చెప్పే యత్నం చేశారుఇది కూడా అవకాశవాదంగానే కనిపిస్తుంది. సిద్దాంతాలు ,విధానాలతో కాకుండా రాజకీయ అవసరాల కోసం పొత్తు లు పెట్టుకుంటామని ఆయన నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఇక దీనిపై ఆలోచించాల్సింది ఆయనకు మద్దతు ఇచ్చేవారు. ప్రజలే అని చెప్పాలి. 


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top