ఈ ఒక్క పదానికే ఈటెలను సస్పెండ్ చేయడమంటే..!

Kommineni Srinivasa Rao Comment Over Etela Suspension - Sakshi

శాసనసభ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను సస్పెండ్ చేయడం కూడా చర్చనీయాంశం అయింది. ఈటల స్పీకర్‌ను ఉద్దేశించి మరమనిషి మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంటే యాంత్రికంగా స్పీకర్ నిర్ణయాలు అమలు చేస్తున్నారని దాని అర్దం. నిజమే. స్పీకర్ కు ఎవరైనా గౌరవం ఇవ్వవలసిందే. కాని ఈ ఒక్క పదానికే ఈటెలను సస్పెండ్ చేయడం రాజకీయ నిర్ణయంగానే కనిపిస్తుంది తప్ప, సభా సంప్రదాయాలకు అనుగుణంగా ఉందా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో స్పీకర్ స్థానంలో ఉన్నవారిపట్ల ఇంతకన్నా ఘోరంగా ప్రవర్తించినా, సస్పెన్షన్ ఆయుధాన్ని చాలా తక్కువసార్లు వాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అయితే సభలోనే ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు.

ఒక సారి గవర్నర్ నరసింహన్ సభలో ప్రసంగం చేస్తున్నప్పుడు హరీష్ రావు, రేవంత్ రెడ్డి, నాగం జనార్ధనరెడ్డి ప్రభృతులు ఏకంగా పోడియంలోకి వెళ్లి కుర్చీ లాగేశారు. ఆ తర్వాత వీరిని కొద్ది రోజులు సస్పెండ్ చేశారు. గత శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న రేవంత్ రెడ్డి, సంపత్ ల ప్రవర్తన బాగోలేదని చెప్పి చాలా రోజులు సస్పెండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు గవర్నర్ స్పీచ్ జరుగుతున్న సమయంలోనే ఆ పుస్తకం కాపీలను చించి గవర్నర్, స్పీకర్ లపై విసిరివేశారు.

అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుని ప్రవర్తనా నియమావళి అంటే ఎథిక్స్ కమిటీని నియమించింది. అయినా అది కూడా రాజకీయ వేదికగానే మిగిలిందని చెప్పాలి. యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉన్నప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుడైన ఎన్.టి.రామారావుకు సభలో మాట్లాడాలని ప్రయత్నించగా, అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి, చంద్రబాబుపై  ఎన్.టి.ఆర్. విమర్శలు ఆరంభించగానే  పలుమార్లు మైక్ కట్ చేశారు. ఆ నేపద్యంలో టీడీపీలో ఎన్.టి.ఆర్.వర్గం స్పీకర్ పై తీవ్ర విమర్శలే చేసేది.  శాసనసభ స్పీకర్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. అది టీడీపీ హయాంలో  జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ జరిగింది. ఆ సమయంలో స్పీకర్‌పై నేరుగా బహిరంగ విమర్శలే చేసేవారు. 

ఆ మాటకు వస్తే అధికార పార్టీలో వచ్చిన విభేదాల కారణంగా స్పీకర్ ఇబ్బంది పడ్డ ఘట్టాలు ఉన్నాయి. చెన్నారెడ్డి ముఖ్యమంత్రగా ఉన్నప్పుడు సీనియర్ నేత పి.రామచంద్రారెడ్డి స్పీకర్ గా ఉండేవారు. ఒక వివాదం నేపద్యంలో అసెంబ్లీలో ఆయన కంటతడిపెట్టిన ఘట్టం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, స్పీకర్ బివి సుబ్బారెడ్డిల మధ్య ఒక అంశంలో వచ్చిన పట్టుదలల కారణంగా సభలో  ఆ అంశంపై ఓటింగ్ జరగడం, స్పీకర్ వాదన వీగిపోవడం, దాంతో ఆయన రాజీనామా చేసి స్పీకర్ స్తానం నుంచి వెళ్లిపోవడం జరిగాయి. తదుపరి కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని మళ్లీ సుబ్బారెడ్డినే స్పీకర్ పదవిలో కొనసాగించింది. ఇలా చాలా ఉదాహరణలు ఉ జరుగుతుంటాయి. అధికార పార్టీ కనుసన్నలలోనే, ముఖ్యమంత్రి సూచనల మేరకే స్పీకర్ వ్యవహరిస్తున్నారన్న విమర్శ సర్వసాధారణంగా ప్రతిపక్షం చేస్తుంటుంది. అంతమాత్రాన స్పీకర్ ను అవమానించినట్లు కాదు. ఉమ్మడి సభలో స్పీకర్ చాంబర్ లోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ధర్నాలు, ఘెరావో వంటి ఆందోళనలు కూడా చేసేవారు.

ఒక్కటి మాత్రం వాస్తవం. స్పీకర్ కూడా అదికార పార్టీ సభ్యుడే . అందువల్ల అదికార పార్టీని, అందులోను ముఖ్యమంత్రిని కాదని ఏమీ చేయరు.సభలో స్పీకర్ బాద్యత కత్తిమీద సాము వంటిది. అదికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అదే సమయంలో ప్రతిపక్షాన్ని విస్మరిస్తున్నట్లు కనిపించకూడదు. తమకు సరిగా అవకాశం ఇవ్వడం లేదని, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వసాధారణం. అయితే విభజనకు ముందు సస్సన్షన్ల తీరు ఒక రకంగాను, ఇప్పుడు ఒకరకంగా ఉంటున్నాయన్న అబిప్రాయం ఉంది. అప్పట్లో సభ్యుడి సస్పెండ్ అయినా, అసెంబ్లీ ప్రాంగణంలో ఉండడానికి ఎవరూ అభ్యంతర పెట్టేవారు. కాని ఈటెల విషయంలో కనీసం ఆయన సొంతకారులో కూడా వెళ్లనివ్వకుండా పోలీసులే ఆయనను షామీర్ పేటలోని ఇంటివద్ద విడిచిపెట్టి రావడం కొత్త ట్రెండ్.

ఏపీ అసెంబ్లీలో ప్రముఖ నటి నగరి ఎమ్మెల్యే రోజాను చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాటు సస్పెండ్ చేయడం వివాదం అయింది. ఆమె కోర్టునుంచి అనుమతి తెచ్చుకున్నా సభలోకి రానివ్వలేదు. కేసీఆర్‌ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న ఈటెల వివిధ కారణాల వల్ల మంత్రి పదవిని కోల్పోయారు.తదుపరి ఆయన టిఆర్ఎస్ ను వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తదుపరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో  బీజేపీ పక్షాలన టిఆర్ఎస్ పై ఘన విజయం సాదించారు. అప్పటి నుంచి టిఆర్ఎస్ కు ఆయనకు మద్య నిత్యం ఘర్షణ  వాతావరణం ఏర్పడుతోంది.  ఈటెల విమర్శలను మరీ అంత సీరియస్ గా టిఆర్ఎస్  తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో! ఈటెల కూడా కాస్త తగ్గి క్షమాపణ చెప్పి ఉంటే  ఎలా ఉండేదో.కాకపోతే రాజకీయాలలో పట్టుదలలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈటెల మొహం చూడకూడదని సీఎం కేసీఆర్‌ అనుకున్నప్పటికీ ఆయన గెలిచారన్న బావనతో ఇలా చేస్తున్నారని బీజేపీ విమర్శ. ఏది ఏమైనా స్పీకర్ వ్యవస్థను అంతా గౌరవిస్తే మంచిది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, 
సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top